గండిపేట, వెలుగు: శంషాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో కేవలం రెండు రోజుల వ్యవధిలోనే రెండోసారి ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించడం సంచలనం రేపుతోంది. అవినీతి ఆరోపణలు, బాధితుల నుంచి అందిన ఫిర్యాదుల మేరకు ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ నేతృత్వంలో సోమవారం ఈ దాడులు జరిగాయి. ఉదయాన్నే కార్యాలయానికి చేరుకున్న అధికారులు గేట్లు మూసివేసి, సిబ్బందిని బయటకు వెళ్లనివ్వకుండా గంటల తరబడి సోదాలు నిర్వహించారు.
భూ రికార్డుల మార్పులు, రిజిస్ట్రేషన్ల కోసం కొందరు అధికారులు భారీగా ముడుపులు డిమాండ్ చేస్తున్నారన్న ఫిర్యాదుల నేపథ్యంలో.. పెండింగ్లో ఉన్న దరఖాస్తులు, వీఆర్వోలు, ఉన్నతాధికారుల వద్ద ఉన్న రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. గత రెండు రోజుల క్రితం జరిగిన తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న కీలక పత్రాల ఆధారంగా మరిన్ని వివరాలు సేకరించేందుకే రెండోసారి రైడ్ నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. అవినీతికి పాల్పడే ఏ ఒక్కరిని వదిలే ప్రసక్తి లేదని, సమగ్ర విచారణ అనంతరం ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని డీఎస్పీ స్పష్టం చేశారు.
