- మహేశ్ గౌడ్‌కు ఫైనల్ రిపోర్ట్ ఇచ్చిన జగ్గారెడ్డి
- మూడు మండలాల్లో పార్టీ రూల్స్‌కు విరుద్ధంగా అధ్యక్షుల నియామకాలు జరిగాయని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: సూర్యాపేట జిల్లా తుంగతుర్తి కాంగ్రెస్‌లో కొనసాగుతున్న విభేదాలపై పార్టీ అబ్జర్వర్, సీనియర్ నేత జగ్గారెడ్డి తన ఫైనల్ రిపోర్ట్‌ను పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్‌కు అందించారు. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే మందుల సామ్యేల్ మధ్య నెలకొన్న వివాదంపై క్షేత్రస్థాయిలో వివరాలు సేకరించి మంగళవారం గాంధీ భవన్‌లో 7 పేజీల నివేదిక ఇచ్చారు.
అనంతరం మీడియాతో జగ్గారెడ్డి మాట్లాడుతూ తుంగతుర్తి నియోజకవర్గంలో మొత్తం 9 మండలాలు ఉన్నాయని, వాటిలో 6 మండలాల్లో కాంగ్రెస్ మండల అధ్యక్షుల నియామకాలు ఏఐసీసీ గైడ్‌లైన్స్ ప్రకారమే జరిగాయని చెప్పారు. అయితే మిగిలిన 3 మండలాల్లో మాత్రం పార్టీ నిబంధనలకు విరుద్ధంగా అధ్యక్షుల నియామకాలు జరిగినట్లు తన రిపోర్ట్‌లో పేర్కొన్నట్లు తెలిపారు.
తుంగతుర్తి కాంగ్రెస్‌లో ఎస్సీ, రెడ్డి సామాజిక వర్గాల మధ్య విభేదాలు ఉన్నాయన్న ప్రచారాన్ని జగ్గారెడ్డి ఖండించారు. పార్టీ నేతలంతా సమన్వయంతో కలిసి పనిచేయాలని సూచించారు. తాను ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా పార్టీ హైకమాండ్ తుది నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.
