నో రిలీఫ్ : హోం లోన్, కారు లోన్ పై EMI తగ్గలేదు.. వడ్డీలు కట్టేవాళ్లపై కనికరం చూపని RBI

నో రిలీఫ్ : హోం లోన్, కారు లోన్ పై EMI తగ్గలేదు.. వడ్డీలు కట్టేవాళ్లపై కనికరం చూపని RBI

భారతీయ రిజర్వు బ్యాంక్ మానిటరీ పాలసీ సమావేశంలో మరోసారి వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు చేయకుండా స్టేటస్ కో కొనసాగించనున్నట్లు ప్రకటించింది. బుధవారం ముగిసిన 3 రోజుల సమావేశంలో 6 సభ్యులు ఏకగ్రీవంగా రెపో రేటును 5.25 శాతం వద్ద కొనసాగించాలని నిర్ణయించారు. దీంతో వరుసగా వ4 సారి కూడా వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచడం ద్వారా ఆర్‌బీఐ స్థిరత్వానికే ప్రాధాన్యం ఇచ్చింది.

వడ్డీ పెంపు కాదు.. తగ్గింపు కాదు
ఆహార, ఇంధన ధరల కారణంగా హెడ్‌లైన్ ద్రవ్యోల్బణం పెరిగినా.. కోర్ ఇన్‌ఫ్లేషన్ అదుపులోనే ఉందని గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. 2-6 శాతం లక్ష్య పరిధిలోనే ద్రవ్యోల్బణం కొనసాగుతుండటంతో ప్రస్తుతం వడ్డీ రేట్లను పెంచాల్సిన అవసరం లేదని, అదే సమయంలో తగ్గించే పరిస్థితి కూడా లేదని స్పష్టం చేశారు. అందుకే న్యూట్రల్ స్టాన్స్‌ను కొనసాగిస్తూ పరిస్థితులను పరిశీలిస్తామని వెల్లడించారు.

వృద్ధి అంచనాలు పెంపు.. 
భారత ఆర్థిక వ్యవస్థపై విశ్వాసాన్ని వ్యక్తం చేసిన ఆర్‌బీఐ.. FY27 జీడీపీ వృద్ధి అంచనాను 6.6 శాతం నుంచి 6.7 శాతానికి పెంచింది. తొలి త్రైమాసిక వృద్ధి అంచనాను 7 శాతానికి పెంచగా, రెండో త్రైమాసికాన్ని 6.4 శాతానికి సవరించింది. మరోవైపు FY27 సీపీఐ ద్రవ్యోల్బణ అంచనాను 5.1 శాతం నుంచి 5 శాతానికి తగ్గించింది. కోర్ ఇన్‌ఫ్లేషన్ అంచనాను కూడా 4.7 శాతం నుంచి 4.3 శాతానికి కుదించింది.

ప్రపంచ అనిశ్చితులపై ఫోకస్..
మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు, ఇంధన ధరల అస్థిరత, గ్లోబల్ వాణిజ్య అనిశ్చితులు వంటి అంశాలు ఇంకా ప్రమాద సంకేతాలుగా ఉన్నాయని గవర్నర్ పేర్కొన్నారు. అయినప్పటికీ దేశీయ డిమాండ్ బలంగా ఉండటం, హై-ఫ్రీక్వెన్సీ ఆర్థిక సూచీలు సానుకూలంగా ఉండటంతో భారత ఆర్థిక వ్యవస్థ నిలకడగా ముందుకు సాగుతుందని చెప్పారు. అవసరమైనంత లిక్విడిటీని బ్యాంకింగ్ వ్యవస్థలో అందుబాటులో ఉంచుతామని కూడా హామీ ఇచ్చారు.

మరి ప్రజలకు, మార్కెట్లకు?
వడ్డీ రేటులో మార్పు లేకపోవడంతో హోమ్, వెహికల్, బిజినెస్ లోన్ ఈఎంఐల్లో ఎలాంటి మార్పులు ఉండే అవకాశం లేదు. చాలా కాలంగా వడ్డీ రేట్లు తగ్గితే ఈఎంఐల భారం నుంచి ఉపశమనం లభిస్తుందని కలలు కన్న సామాన్యులకు రిజర్వు బ్యాంక్ ప్రకటన నిరాశనే మిగిల్చింది. ఇక బ్యాంకులు కూడా ప్రస్తుతం ఉన్న రుణ, డిపాజిట్ వడ్డీ రేట్లను కొనసాగించే అవకాశమే ఎక్కువ. మార్కెట్ అంచనాలకు అనుగుణంగా నిర్ణయం రావడంతో పెట్టుబడిదారుల్లో స్థిరత్వంపై విశ్వాసం పెరిగింది. ఇకపై ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ పరిణామాల ఆధారంగా వచ్చే సమావేశాల్లో ఆర్‌బీఐ భవిష్యత్తులో వడ్డీ రేట్ల మార్పులను ప్రకటించవచ్చు. సో ఈ సారికి లోన్ చెల్లింపుదారులకు నో రిలీఫ్ అన్నమాట.