హనుమకొండ అడిషనల్ కలెక్టర్ వెంకట్ రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వెంకట్ రెడ్డిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసింది ఏసీబీ. వెంకట్ రెడ్డిపై అవినీతి నిరోధక చట్టం 1988 (సవరణ 2018) సెక్షన్ 13(1)(b), 13(2) కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు ఏసీబీ అధికారులు. బుధవారం ( జనవరి 21 ) వెంకట్ రెడ్డి ఇంటితో పాటు అతని బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు ఏసీబీ అధికారులు.
వెంకట్ రెడ్డి స్థిరాస్తుల వివరాలు:
- రూ.4.65 కోట్ల విలువైన రెండు నివాస గృహాలు (విల్లా + ఫ్లాట్)
- రూ.60 లక్షల విలువైన ఒక కమర్షియల్ షాప్
- రూ.65 లక్షల విలువైన 8 ఓపెన్ ప్లాట్లు
- రూ.50 లక్షల విలువైన 14.25 ఎకరాల వ్యవసాయ భూమి
- మార్కెట్ విలువ ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం
- చరాస్తుల వివరాలు:
- రూ.30,00,300 నగదు స్వాధీనం
- రూ.44,03,032 బ్యాంక్ నిల్వలు
- రూ.11 లక్షల విలువైన గృహోపకరణాలు
- రూ.40 లక్షల విలువైన మూడు కార్లు
- 297 గ్రాముల బంగారు ఆభరణాలు (రూ.4.35 లక్షలు)
- మొత్తం ఆస్తుల అంచనా విలువ: రూ.7.69 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు.
ఇదిలా ఉండగా.. 2025 డిసెంబర్ 5న వెంకట్‌రెడ్డి ఏసీబీకి చిక్కాడు. ఓ ప్రైవేట్ స్కూల్ పర్మిషన్ రెన్యూవల్ చేసేందుకు రూ. లక్ష డిమాండ్ చేయగా.. డీఈవో ఆఫీస్ సిబ్బంది ద్వారా రూ.60 వేలు తీసుకుంటుండగా ఏసీబీ ఆఫీసర్లు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వరంగల్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య వివరాల ప్రకారం... హనుమకొండ కొత్తూరుజెండా ప్రాంతంలోని ఓ ప్రైవేట్ స్కూల్ పర్మిషన్ రెన్యూవల్ కోసం కరస్పాండెంట్ గత నెలలో ఆన్‌లైన్‌లో అప్లికేషన్ పెట్టుకున్నాడు. నెల గడిచినా పర్మిషన్ రాకపోవడంతో సదరు స్కూల్ కరస్పాండెంట్ డీఈవో ఆఫీస్‌కు వెళ్లి సీనియర్ అసిస్టెంట్ ఎండీ.గౌస్, జూనియర్ అసిస్టెంట్ కన్నెబోయిన మనోజ్‌ను కలిశాడు.
దీంతో వారు ఇన్‌చార్జి డీఈవోగా పనిచేస్తున్న అడిషనల్ కలెక్టర్ వెంకట్‌రెడ్డికి విషయం చెప్పారు. పర్మిషన్ ఇచ్చేందుకు రూ. లక్ష డిమాండ్ చేయడంతో ఆ విషయాన్ని సిబ్బంది కరస్పాండెంట్‌కు చెప్పారు. దీంతో అతడు అడిషనల్ కలెక్టర్‌ను కలిసి అంత ఇచ్చుకోలేనని ప్రాధేయపడడంతో.. తాను డీఈవో ఆఫీస్ సిబ్బందికి చెబుతానని అడిషనల్ కలెక్టర్ సమాధానం ఇచ్చారు.
తర్వాత రెండు రోజులైనా పర్మిషన్ రాకపోవడంతో కరస్పాండెంట్ మరోసారి అడిషనల్ కలెక్టర్‌ను సంప్రదించగా.. రూ. 60 వేలకు ఒప్పుకున్నారు. తర్వాత సదరు కరస్పాండెంట్ ఏసీబీ ఆఫీసర్లకు ఫిర్యాదు చేశాడు. వారి సూచనతో రూ. 60 వేలు తీసుకొని డీఈవో ఆఫీస్ వద్దకు వెళ్లగా.. అక్కడ ఉన్న జూనియర్ అసిస్టెంట్ మనోజ్ అడిషనల్ కలెక్టర్ వద్దకు తీసుకెళ్లి విషయం చెప్పాడు.
అనంతరం మనోజ్ కలెక్టరేట్ వెనుక వైపు సీసీ కెమెరాలు పనిచేయని చోటుకు కరస్పాండెంట్‌ను తీసుకెళ్లి డబ్బులు తీసుకొని, అడిషనల్ కలెక్టర్‌కు విషయం చెప్పాడు. అప్పటికే కలెక్టరేట్‌కు చేరుకున్న ఏసీబీ ఆఫీసర్లు అడిషనల్ కలెక్టర్ వెంకట్‌రెడ్డితో పాటు జూనియర్ అసిస్టెంట్ మనోజ్, సీనియర్ అసిస్టెంట్ గౌస్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
