
భూపాలపల్లి సింగరేణి ఏరియాలో ప్రమాదం జరిగింది. కేటీకే 5 ఇంక్లైన్ రెండవ లెవెల్ వద్ద వెల్డింగ్ చేస్తున్న క్రమంలో నిప్పు అంటుకుని విషవాయువులు వెలువడ్డాయి. దీంతో అన్వేష్, ప్రదీప్ అనే ఇద్దరు కార్మికులకు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన తోటి కార్మికులు అన్వేష్, ప్రదీప్‌ను సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారు. గురువారం (సెప్టెంబర్ 18) మొదటి షిఫ్ట్ ఎండింగ్ సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. సింగరేణి అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
ఇటీవలే కేటీకే 6 ఇంక్లైన్లో రూప్ కూలి కార్మికుడు గాయపడ్డ సంఘటన మరువకముందే మరో ఘటనతో భూపాలపల్లి సింగరేణి కార్మికులు ఉలిక్కిపడ్డారు. అధికారుల నిర్లక్ష్యం, సేఫ్టీ సూచనలు పాటించకపోవడం వల్లనే తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని కార్మికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు మొద్దు నిద్ర వీడి పని ప్రదేశంలో కార్మికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు.