జేసీబీలో ఆసుపత్రికి క్షతగాత్రుడి తరలింపు

జేసీబీలో ఆసుపత్రికి క్షతగాత్రుడి తరలింపు

సరైన రోడ్డు సౌకర్యాలు, అంబులెన్స్ సౌకర్యం లేక ప్రమాద బాధితులను ఆస్పత్రి చేర్చడంలో ఇబ్బందులు ఎదుర్కోవడం లాంటి సంఘటనలు చాలానే చూసి ఉంటాం. అలాంటి సంఘటనే మధ్యప్రదేశ్ లో జరిగింది. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తిని జేసీబీలో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన ఆ రాష్ట్రంలోని కత్నీ జిల్లాలో చోటుచేసుకుంది. కత్నీ జిల్లా ఖిటౌలీ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ బైకర్ తీవ్రంగా గాయపడ్డాడు. 108 అంబులెన్సుకు ఫోన్ చేసినా, సర్వీసు మార్పు వల్ల అది సకాలంలో రాలేదు. దీంతో జనపద్ పంచాయతీ సభ్యుడు, జేసీబీ యజమాని అయిన పుష్పేంద్ర విశ్వకర్మ వెంటనే స్పందించారు. తన జేసీబీలోనే క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. 

దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది కాస్తా వైరల్ గా అయింది. అయితే రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే ఆ బాధితున్ని తరలించేందుకు అంబులెన్స్ సరైన సమయానికి రాలేదని జేసీబీ యజమాని అయిన పుష్పేంద్ర విశ్వకర్మ తెలిపారు. అక్కడున్న ఆటో డ్రైవర్లు సైతం అతన్ని తీసుకెళ్లేందుకు నిరాకరించడంతో తన జేసీబీలోనే ఆస్పత్రికి తరలించాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. గత నెలలో నీమచ్ జిల్లాలో వచ్చిన వరదలతో అంబులెన్స్ రాకపోవడంతో ఓ గర్భవతిని జేసీబీలోనే ఆసుపత్రికి తరలించారు.