V6 News

ఎఫ్‌‌‌‌‌‌‌‌సీఐ నిబంధనల ప్రకారం ధాన్యం తేవాలి : మంత్రి గంగుల

ఎఫ్‌‌‌‌‌‌‌‌సీఐ నిబంధనల ప్రకారం ధాన్యం తేవాలి : మంత్రి గంగుల

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు : రాష్ట్ర వ్యాప్తంగా 38.50 లక్షల టన్నుల వడ్ల కొనుగోళ్లు జరిగాయని సివిల్‌‌‌‌‌‌‌‌ సప్లయ్స్‌‌‌‌‌‌‌‌ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. మంగళవారం సెక్రటేరియెట్‌‌‌‌‌‌‌‌లో ధాన్యం కొనుగోళ్లపై మంత్రి ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. రైతు అనుకూల విధానాలతో ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్‌‌‌‌‌‌‌‌గా నిలిచిందన్నారు.  రాష్ట్ర వ్యాప్తంగా 7వేల కొనుగోలు సెంటర్ల ద్వారా 6 లక్షల 5వేల మంది రైతుల నుంచి  రూ.7,907 కోట్ల విలువైన వడ్లు సేకరించినట్లు చెప్పారు. సరాసరి రోజుకు లక్షన్నర టన్నుల ధాన్యాన్ని సేకరిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే 400 లకు పైగా సెంటర్లలో కొనుగోళ్లు పూర్తి చేసి  మూసేశామన్నారు.

రైతులు ఎఫ్‌‌‌‌‌‌‌‌సీఐ నిబంధనల మేరకు వడ్లు సెంటర్లకు తేవాలన్నారు. ధాన్యం కొనుగోళ్లలో అక్కడక్కడా ఎదురవుతున్న  సమస్యలపై ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగం స్పందిస్తున్నదన్నారు. విపత్కర పరిస్థితుల్లో మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తూ రైతులకు ఇబ్బంది కలుగకుండా చూడాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఇదే అంశంపై బుధవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమస్యలను మరింత వేగంగా పరిష్కరిస్తామన్నారు. ఈ సమీక్షలో సివిల్‌‌‌‌‌‌‌‌ సప్లయ్స్‌‌‌‌‌‌‌‌ కమిషనర్‌‌‌‌‌‌‌‌  అనిల్ కుమార్,  జీఎం రాజారెడ్డి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.