- నాంపల్లి కోర్టు తీర్పు
ముషీరాబాద్,వెలుగు : మూడేళ్ల బాలుడి హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ శిక్ష విధిస్తూ మంగళవారం నాంపల్లి కోర్టు తీర్పు చెప్పింది. ముషీరాబాద్ సీఐ జహంగీర్ యాదవ్ వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లికి చెందిన నాగలక్ష్మి(34) భర్త పిల్లలతో కలిసి ఉపాధి కోసం సిటీకి వచ్చింది. రాంనగర్లో ఉంటూ కూలిపనికి వెళ్లేది. ఆమెకు నిజామాబాద్ ప్రాంతానికి చెందిన ముస్తాల రవి(34)తో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారి తీసింది.
నాగలక్ష్మి కొడుకు(3) తమకు అడ్డుగా ఉన్నాడని రవి ప్లాన్ ప్రకారం ఆ బాలుడి గతేడాది ఆగస్టులో చిత్రహింసలకు గురిచేసి హత్య చేశాడు. నాగలక్ష్మి సైతం ఏమీ తెలియనట్టు నటించి అంత్య క్రియలు పూర్తి చేయించింది. పోస్ట్ మార్టంలో హత్యగా తేలడంతో పోలీసులు రవితో పాటు నాగలక్ష్మిని అరెస్ట్ చేశారు. నిందితుడు రవిపై పోక్సో యాక్ట్ కింద కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు. రిపోర్టును కోర్టులో సమర్పించారు. మంగళవారం కేసు విచారణలో బాగంగా రవికి యావజ్జీవ శిక్షతో పాటు రూ. 15 వేల ఫైన్ విధిస్తూ నాంపల్లి కోర్టు జడ్జి తీర్పు చెప్పారు.
