మస్కట్: గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఒమన్ తీరంలో వరుసగా వాణిజ్య నౌకలపై దాడులు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే 24 మంది భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న మరో వాణిజ్య నౌకపై బుధవారం (జూన్ 10) ఒమన్ తీరంలో మిస్సైల్ అటాక్ జరిగింది. ఈ ఘటన సమయంలో నౌకలో 24 మంది భారతీయ నావికులు ఉన్నారు. ఇందులో 21 మంది భారతీయ సిబ్బందిని రక్షించగా.. ముగ్గురు గల్లంతు అయినట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) వెల్లడించింది. గల్లంతైన వారి కోసం సహయక చర్యలు కొనసాగుతున్నాయని.. అక్కడి భారత రాయబార కార్యాలయం పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తూ ఒమన్ అధికారులతో సమన్వయం చేసుకుంటోందని ఎంఈఏ తెలిపింది.
పలావు జెండాతో ప్రయాణిస్తున్న ఎంటీ సెట్టెబెల్లో అనే వాణిజ్య నౌకపై ఒమన్‌లోని సోహార్ రేవు పట్టణానికి ఈశాన్యంగా సుమారు 20 నాటికల్ మైళ్ల దూరంలో హార్ముజ్ జలసంధి సమీపంలో ఈ దాడి జరిగింది. అమెరికా క్షిపణి దాడి వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని మారిటైమ్ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అమెరికా-ఇరాన్ వార్తో పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగానే ఈ దాడి జరిగింది.
దాడిని తీవ్రంగా ఖండిస్తున్నం: ఎంఈఏ
ఒమన్ తీరంలో భారతీయ నావికులతో వెళ్తున్న వాణిజ్య నౌక దాడి జరిగిన ఘటనను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. ‘‘ఒమన్ తీరంలో సెట్టెబెల్లో వాణిజ్య నౌకపై జరిగిన దాడిని మేము ఖండిస్తున్నాము. నౌకలోని 24 మంది భారతీయ సిబ్బందిలో ఇప్పటివరకు 21 మంది భారతీయులను రక్షించారు. మరో ముగ్గురు భారతీయులు గల్లంతైనట్లు సమాచారం. ఒమన్‌లోని మా రాయబార కార్యాలయం పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోంది. కొనసాగుతున్న గాలింపు, సహాయక చర్యలలో ఒమన్ అధికారులతో చురుకుగా సమన్వయం చేసుకుంటోంది’’ అని ఎంఈఏ తెలిపింది.
►ALSO READ | నాకు పార్టీ కంటే దేశ ప్రజలే ముఖ్యం.. దేశ భవిష్యత్ కోసం కఠిన నిర్ణయాలకు వెనుకాడం: ప్రధాని మోడీ
ఒమన్ తీరంలో నౌకా రవాణాపై నిరంతరం జరుగుతున్న దాడులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తక్షణమే తగ్గించాలని, దౌత్యపరమైన పరిష్కారం కోసం కొనసాగుతున్న చర్చలను ముగించాలని పిలుపునిచ్చింది. తద్వారా ఈ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం తిరిగి నెలకొంటాయని పేర్కొంది.
ఈ ప్రాంతంలో వాణిజ్య నౌకా రవాణా, పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడం ముగియాలని కోరింది. అంతర్జాతీయ చట్టానికి అనుగుణంగా ఈ ప్రాంతంలోని అంతర్జాతీయ జలమార్గాల ద్వారా స్వేచ్ఛాయుతమైన, నిరాటంకమైన నౌకాయానం, వాణిజ్యాన్ని వీలైనంత త్వరగా పునరుద్ధరించాలని పిలుపునిచ్చింది.
