ముత్యాలమ్మ గూడెంలో రామక్క అనే ముసలామె ఉండేది. ఆమె కోళ్లను సాదుతుండేది. అందులో రెండు కోడి పుంజులు బాగా పెద్దవిగా ఉండేవి. అవి ఎప్పుడూ కొట్లాడుకుంటూనే ఉండేవి. 'నేను గొప్ప అంటే నేను గొప్ప' అని లేనిపోని పట్టింపులకు దిగేవి. పైగా పోటీలు పడుతుండేవి. ఆ కోడిపుంజుల కొట్లాటను చూసి 'ఇలా చీటికిమాటికి తగువు లాడుకుంటే మీకే నష్టం' అని మిగతా కోళ్లు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకునేవి కావు.
ఒక రోజు మళ్లీ ఆ రెండు పుంజులు పోట్లాడుకుంటూ 'మనలో ఎవరు గొప్పో తెలుసుకోవడానికి ఒక పోటీ పెట్టుకుందాం.. ఎవరు ఎక్కువ ఎత్తుకు ఎగర గలిగితే వారే గొప్ప' అని పోటీకి దిగాయి. ‘సరే అంటే సరే' అని ఆ రెండు కోడిపుంజులు బడాయి తనంతో ఒకదాని కంటే మించి మరొకటి పైకి ఎగరడం మొదలుపెట్టాయి.
వాటిలో ఒక పుంజు గోడ మీదికి ఎగిరితే, మరొకటి ఇంటి పై కప్పు మీదికి ఎగిరింది. దాంతో మొదటిది ఒక చెట్టు కొమ్మ పైకి ఎగరగా రెండోది చాలా ఎత్తుగా ఉన్నకోట బురుజు పైకి ఎక్కి కూర్చుంది. మొదటి పుంజు ఎంత ప్రయత్నించినా అంత ఎత్తుకు ఎగర లేకపోయింది. ఇక తానే గెలిచానని విర్రవీగింది.రెక్కలు విప్పుకొని కళ్ళు మూసుకొని విజయగర్వంతో గట్టిగా నవ్వడం ప్రారంభించింది.
ఈ శబ్దం విన్న డేగ కోడిపుంజు వైపు చూసింది.కళ్ళు మూసుకొని ఆనందంగా నవ్వుతున్న కోడి పుంజును చూడగానే డేగకు ఎక్కడలేని ఆకలి పుట్టుకొచ్చింది. ఇదే అదనుగా క్షణాలలో పుంజు మీదకు దూకి, కాళ్లతో పట్టుకుని పైకి ఎగిరి పోయింది.
ఇదంతా గమనిస్తూ చెట్టుపై ఉన్న మొదటి కోడి పుంజు 'బతికిపోయాను రా దేవుడో' అనుకుంది.కానీ 'అనవసరంగా లేనిపోని పోటీలకు పోయి నా స్నేహితురాలిని కళ్ళముందే పోగొట్టుకుంటినే' అని బాధపడింది. మళ్ళీ ఎప్పుడూ ఇలాంటి పోటీలకు పోవద్దనుకుంది. పెద్దలు చెప్పిన మాట వినక పోయినందుకు తగిన శాస్తే జరిగిందనుకుని బాధపడింది.
