ఈ రోజుల్లో కొత్త కార్ల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. పైగా కొన్న వెంటనే వాటి వాల్యూ పడిపోతుంటుంది. అందుకే చాలామంది సెకండ్ హ్యాండ్ కార్లను కొనడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇది మంచి ఆలోచనే అయినా.. సరైన అవగాహన లేకుండా తొందరపడితే డబ్బు ఆదా అవ్వడానికి బదులు అనవసరంగా ఖర్చు చేయాల్సి వస్తుంది. మీరు కూడా పాత కారు కొనాలని ఆలోచిస్తుంటే ఈ విషయాలను కచ్చితంగా గుర్తుంచుకోండి...
కారు ఫిట్ నేస్
మీరు కారు కొనేటప్పుడు దాని ఎన్ని ఏళ్ల క్రితం తయారైంది, ఎంత కాలంగా వాడుతున్నారు అనేది చాలా ముఖ్యం. 3 నుంచి 5 సంవత్సరాల పాత కారు కొనడం చాల బెస్ట్. కొత్త కారు షోరూమ్ నుంచి బయటకు రాగానే దాని విలువ వెంటనే 10 నుంచి 15 శాతం తగ్గిపోతుంది. మొదటి మూడేళ్లలోనే కారు విలువ సుమారు 30 నుంచి 40 శాతం వరకు పడిపోతుంది. కాబట్టి, 3-5 ఏళ్ల పాత కారును తీసుకుంటే తక్కువ ధరకే మంచి కారు సొంతం చేసుకోవచ్చు.
3 నుంచి 5 ఏళ్ల కార్ల వల్ల లాభాలేంటి?
ఈ వయసున్న కార్లలో ఇంజిన్, విడిభాగాలు, ఇంటీరియర్ చాలావరకు మంచి కండీషన్లో ఉంటాయి. దీనివల్ల పెద్దగా మెయింటెనెన్స్ ఖర్చులు రావు. అంతేకాకుండా, ఈ మోడల్ కార్లలో బ్లూటూత్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, రివర్స్ కెమెరా, ఏబీఎస్ (ABS) వంటి లేటెస్ట్ ఫీచర్లు కూడా లభిస్తాయి.
ఎలాంటి కార్లను అసలు కొనకూడదు?
7 నుంచి 8 సంవత్సరాలు దాటిన పాత కార్లను కొనకపోవడమే మంచిది. ఎందుకంటే వాటి మెయింటెనెన్స్ ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. టైర్లు, క్లచ్, బ్రేకులు, సస్పెన్షన్ మార్చాలంటే పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుంది.
కొన్ని రాష్ట్రాల్లో అయితే రూల్స్ చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాయి. అక్కడ 10 సంవత్సరాలు దాటిన డీజిల్ వాహనాలు, 15 సంవత్సరాలు దాటిన పెట్రోల్ వాహనాలపై నిషేధం ఉంది. కాబట్టి పాత కారు కొనేముందు ఆర్టీఓ (RTO) నిబంధనలు ఏంటో కచ్చితంగా చెక్ చేసుకోండి.
కారు కొనేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి:
*కారును కొనే ముందు ఆథరైజేడ్ సర్వీస్ సెంటర్‌కి వెళ్లి దాని పూర్తి సర్వీస్ హిస్టరీని అంటే ఎలా మెయింటైన్ చేశారనే వివరాలు వివరంగా చెక్ చేయించండి.
* కారు కొనేందుకు ఫైనల్ చేసే ముందే ఒక మంచి మెకానిక్‌ను తీసుకెళ్లి ఇంజిన్ కండిషన్, యాక్సిడెంట్ హిస్టరీ, ఛాసిస్ సరిగ్గా ఉన్నాయో లేదో చూపించండి.
*కారుపై ఎలాంటి లోన్లు, చలాన్లు లేకుండా చూసుకోండి. అలాగే ఆర్సీ (RC), ఇన్సూరెన్స్, పీయూసీ (PUC) సర్టిఫికేట్లు అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోండి.
