దేశంలో ఇంధన విప్లవం కొత్త పుంతలు తొక్కుతోంది. పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు పెట్రోల్ బిల్లుల భారాన్ని దించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఇథనాల్ బ్లెండింగ్ భారీగా ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగానే కొద్ది రోజుల కిందట ‘E85’ అంటే 85% ఇథనాల్ + 15% పెట్రోల్ ఉన్న ఇంధనాన్ని తీసుకొచ్చింది. ప్రస్తుతానికి మన మార్కెట్లో ఈ సరికొత్త E85 ఫ్యూయల్‌ను సపోర్ట్ చేసే ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాలు కేవలం మూడంటే మూడే అందుబాటులో ఉన్నాయి. అవేంటో క్లారిటీగా చూసేద్దాం..
1. మారుతి సుజుకి వ్యాగన్ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్:
భారతదేశపు మొట్టమొదటి మాస్-మార్కెట్ ఫ్లెక్స్-ఫ్యూయల్ ప్యాసింజర్ కారుగా మారుతి సుజుకి వ్యాగన్ఆర్ సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ కారును E20 నుంచి ఏకంగా E100 అంటే100% ఇథనాల్ పైన నడిచేలా ఇంజనీర్లు డిజైన్ చేశారు. అయితే ప్రస్తుత భారతీయ నిబంధనల ప్రకారం ఇది E85 ఫ్యూయల్‌తో హోమోలోగేట్ చేయబడింది. మారుతున్న ఇథనాల్ శాతానికి అనుగుణంగా ఇంజన్ ట్యూన్ అవ్వడానికి ఇందులో అడ్వాన్స్‌డ్ ఈసీయూ కాలిబ్రేషన్‌ను ఉపయోగించారు. ఎలక్ట్రిక్, హైబ్రిడ్, సీఎన్‌జీలతో పాటు ఇథనాల్ టెక్నాలజీని కూడా సామాన్యుడికి అందుబాటులోకి తేవాలనే ప్లాన్‌లో మారుతి ఉంది. కాకపోతే ఈ కారు పూర్తి స్పెసిఫికేషన్లు, ధర వివరాలను కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
2. హీరో స్ప్లెండర్ ప్లస్ ఫ్లెక్స్ ఫ్యూయల్:
దేశంలోనే అత్యధికంగా అమ్ముడయ్యే బైక్ ‘స్ప్లెండర్’ ఇప్పుడు సరికొత్త ఫ్లెక్స్-ఫ్యూయల్ మోడల్ వచ్చేసింది. ఈ మోటార్ సైకిల్ E20 నుండి E85 ఇంధన బ్లెండ్స్‌తో ఈజీగా నడుస్తుంది. ఇందులో 97.2 సీసీ ఇంజన్‌ను అమర్చారు. ఇది E85 ఫ్యూయల్‌పై నడుస్తున్నప్పుడు 8వేల ఆర్‌పీఎమ్ వద్ద 6.3 కిలోవాట్ల పవర్, అలాగే 6వేల ఆర్‌పీఎమ్ వద్ద 8.3 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో హీరో కంపెనీకి చెందిన పేటెంటెడ్ ‘i3S’ టెక్నాలజీ, డిజిటల్-అనలాగ్ మీటర్, సైడ్-స్టాండ్ ఇంజన్ కట్-ఆఫ్ ఫీచర్, ట్యూబ్‌లెస్ టైర్లను ఇచ్చారు. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.82వేల 710 గా నిర్ణయించారు.
3. హీరో హెచ్ఎఫ్ డీలక్స్ ఫ్లెక్స్ ఫ్యూయల్:
స్ప్లెండర్‌తో పాటు హీరో మోటోకార్ప్ తన బడ్జెట్ బైక్ అయిన హెచ్ఎఫ్ డీలక్స్‌ను కూడా ఫ్లెక్స్-ఫ్యూయల్ వేరియంట్‌లో లాంచ్ చేసింది. ఇందులో కూడా స్ప్లెండర్ లాగే 97.2 సీసీ ఇంజన్ ఉంటుంది. ఇది కూడా E85 ఇంధనంపై సేమ్ 6.3 కిలోవాట్ల పవర్, 8.3 ఎన్ఎమ్ టార్క్‌ను ఇస్తుంది. ఇథనాల్ ఇంధనానికి తట్టుకునేలా దీని ఫ్యూయల్ సిస్టమ్ విడిభాగాలను, ఈసీయూను కంపెనీ అప్‌గ్రేడ్ చేసింది. మిగిలిన ఫీచర్లు అన్నీ స్ప్లెండర్ లాగే ఉన్నప్పటికీ.. దీని ధర మాత్రం కాస్త తక్కువగా ఎక్స్-షోరూమ్ ధర రూ.72వేల 792గా ఉంది.
ALSO READ : లాభాలతో ప్రారంభమై భారీ నష్టాల్లో క్లోజ్ అయిన స్టాక్ మార్కెట్స్..
ఇవి మార్కెట్లోకి ఎప్పుడు వస్తాయి?
హీరో మోటోకార్ప్ సంస్థ తన ఫ్లెక్స్-ఫ్యూయల్ బైకులను మొదటగా జూలై 2026 నుండి ఢిల్లీ, మహారాష్ట్రలోని కొన్ని సెలక్ట్ చేసిన ప్రాంతాల్లో అందుబాటులోకి తెస్తామని, ఆ తర్వాత దేశవ్యాప్తంగా రోల్‌అవుట్ చేస్తామని ప్రకటించింది. ఇక మారుతి సుజుకి తన వ్యాగన్ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్ కారు షోరూమ్ లభ్యత, డెలివరీ టైమ్‌లైన్‌ను త్వరలోనే అనౌన్స్ చేయనుంది. మొత్తానికి తక్కువ ఖర్చుతో పర్యావరణానికి మేలు చేసే సరికొత్త రైడ్‌కు భారత్ రెడీ అవుతోంది. దీనికి తగినట్లుగానే E85 పెట్రోల్ స్టేషన్లను కూడా నెమ్మదిగా రోలౌట్ చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తన రోడ్ మ్యాప్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
