హైదరాబాద్, వెలుగు: సింగరేణి కాలరీస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ అత్యధిక ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్ఎఫ్) సాధించి జాతీయ స్థాయిలో మళ్లీ నంబర్ వన్ గా నిలిచింది. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ రూపొందించిన దేశంలోని 25 అత్యుత్తమ థర్మల్ విద్యుత్ కేంద్రాల జాబితాలో అత్యధికంగా 91.15 శాతం పీఎల్ఎఫ్ తో సింగరేణి థర్మల్ ప్లాంట్ నంబర్ వన్ గా నిలిచింది. దేశంలో దాదాపు 250కి పైగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ థర్మల్ విద్యుత్ కేంద్రాల పీఎల్ఎఫ్ లను దాటి సింగరేణి థర్మల్ ప్లాంట్ ఈ స్థానాన్ని అందుకోవడం ఈ ఆర్థిక సంవత్సరంలో ఇది రెండోసారి.
సీఈఏ నివేదికలో టాప్ 6 ప్లాంట్‌లు ఇవే
సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) వెల్లడించిన నివేదికలో సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ 7,219 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తితో 91.15 పీఎల్‌ఎఫ్‌తో ప్రథమ స్థానంలో నిలవగా.. తర్వాత స్థానంలో చత్తీస్‌గఢ్ ఎన్టీపీసీకి చెందిన కోర్భా ప్లాంట్ నిలిచింది. మూడో స్థానంలో ఎన్టీపీఎసీ వారి సింగ్రౌలి (యూపీ), వింధ్యాచల్ ప్లాంట్ (మధ్యప్రదేశ్) నాలుగు, బక్రేశ్వర్ ప్లాంట్ (బెంగాల్) ఐదు, రిహాంద్ ప్లాంట్(యూపీ) ఆరు స్థానాల్లో నిలిచాయి.
సగటున రూ.400 కోట్ల లాభాలుసింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ 52,328 మిలియన్ యూనిట్ల కరెంటు ఉత్పత్తి చేసి గ్రిడ్ కు అందించింది. రాష్ట్రంలో వినియోగిస్తున్న కరెంట్‌లో 12 శాతం కరెంట్ ను ఈ ప్లాంటే అందించింది. ఏటా సగటున రూ.400 కోట్లకు పైగా లాభాలను అందిస్తోంది. ఈ ప్లాంట్ లోని రెండు యూనిట్లు అత్యంత సమర్థంగా పనిచేస్తున్నాయి. నెలావారీ పనితీరును పరిశీలిస్తే రెండో యూనిట్ ఇప్పటికే 10 సార్లు వంద శాతం పీఎల్ఎఫ్ దాటి కరెంటు ఉత్పత్తి చేసింది. మొదటి యూనిట్ ఎనిమిది సార్లు 100 శాతం పీఎల్ఎఫ్ ను దాటడం విశేషం.

