దేశ యువత రాహుల్ వైపు చూస్తున్నది: ఎంపీ గడ్డం వంశీకృష్ణ

దేశ యువత రాహుల్ వైపు చూస్తున్నది: ఎంపీ గడ్డం వంశీకృష్ణ
  •     ఈ సంక్షోభ సమయంలో రాహుల్ గాంధీ నాయకత్వం అవసరం: ఎంపీ గడ్డం వంశీకృష్ణ
  •     రాహుల్ ను కలిసి బర్త్​డే విషెస్​ తెలిపిన ఎంపీ

న్యూఢిల్లీ/ పెద్దపల్లి, వెలుగు: దేశ యువత రాహుల్​ గాంధీ వైపు చూస్తున్నదని, ఈ సంక్షోభ సమయంలో దేశానికి ఆయన నాయకత్వం అవసరమని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. శుక్రవారం ఢిల్లీలోని పార్టీ ఆఫీసులో రాహుల్ గాంధీని ఎంపీ వంశీకృష్ణ కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపాం. నేడు దేశానికి రాహుల్ గాంధీ లాంటి నిజాయితీ గల, ధైర్యవంతులైన నాయకుల అవసరం ఉంది. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ, యుద్ధ సంక్షోభం, రూపాయి విలువ పతనం, పెట్రోల్ సంక్షోభం వంటి అనేక అంశాలపై రాహుల్ గాంధీ గళమెత్తారు. రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు పోరాడుతున్నారు. ‘భారత్ జోడో యాత్ర’తో ప్రజలతో మమేకమై ఉన్నారు. రాహుల్ తోనే తమకు న్యాయం జరుగుతుందని దేశ యువత ఆయన వైపు చూస్తున్నది” అని అన్నారు. 

ప్రమాదంలో ప్రజాస్వామ్యం

మోదీ పాలనలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ఎంపీ వంశీకృష్ణ ఫైరయ్యారు. తెలంగాణ కాంగ్రెస్  ఇన్​చార్జ్​ మీనాక్షి నటరాజన్​ను రాజ్యసభకు వెళ్లకుండా బీజేపీ అడ్డుకున్న తీరే అందుకు నిదర్శనమన్నారు. మీనాక్షికి గెలిచే సంఖ్యాబలం ఉన్నా.. బీజేపీ అక్కడ అభ్యర్థిని నిలబెట్టి ప్రజాస్వామ్య విరుద్ధంగా సీటును చోరీ చేసిందన్నారు. జార్ఖండ్​లో మాత్రం ఎన్డీఏ బలపరిచిన స్వతంత్ర అభ్యర్థి పరిమళ్ నత్వానీకి నామినేషన్ కు టైమ్​ ఇవ్వడంతోపాటు ఆయన్ను గెలిపించుకోవడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనన్నారు. భారత్ కు చెందిన ముగ్గురు నావికులు అమెరికా అటాక్ లో మరణిస్తే... కనీసం మోదీకి చీమకుట్టినట్టయినా లేదన్నారు. ఇప్పటికీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెంటే మోదీ నడుస్తున్నారన్నారు. ‘ఆపరేషన్ సింధూర్’పై పార్లమెంట్ లో చర్చలో భాగంగా ఎర్రకోట బాంబు పేలుడుపై ప్రశ్నిస్తే.. అధికార పార్టీ మౌనంగా ఉందన్నారు. దేశ భద్రత విషయంలో తాము లేవనెత్తిన ఏ అంశానికీ సమాధానం ఇవ్వకుండా బీజేపీ తప్పించుకున్నదని మండిపడ్డారు.