- రష్యా రాజధాని మాస్కోపై
- ఉక్రెయిన్ డ్రోన్ దాడితో పేలిన రష్యన్ ఆయిల్ రీఫైనరీ ట్యాంకులు
- ఆకాశాన్ని కమ్మేసిన దట్టమైన పొగ.. ఆయిల్‌తో కూడిన వర్షం
- 200కుపైగా డ్రోన్లతో భారీ ఎటాక్ చేసిన ఉక్రెయిన్
ఉక్రెయిన్ భారీ ఎటాక్ చేసింది. దాదాపు 200కు పైగా లాంగ్ రేంజ్ మిసైళ్లతో విరుచుకుపడింది. అతిపెద్ద ఆయిల్ రీఫైనరీ కపోత్న్యాలోని ఇంధన నిల్వ ట్యాంకులు పేలిపోయాయి. దీంతో మాస్కోలోని పలు ప్రాంతాల్లో బ్లాక్ రెయిన్ పడినట్లు మీడియా వెల్లడించింది.
మాస్కో: రష్యా కేపిటల్ సిటీ మాస్కోపై ఉక్రెయిన్ భారీ ఎటాక్ చేసింది. దాదాపు 200కు పైగా లాంగ్ రేంజ్ మిసైళ్లతో విరుచుకుపడింది. దీంతో మాస్కోలోని అతిపెద్ద ఆయిల్ రీఫైనరీ కపోత్న్యాలోని ఇంధన నిల్వ ట్యాంకులు పేలిపోయాయి. పేలుడు తీవ్రతకు ట్యాంక్ పైభాగం మొత్తం గాల్లోకి ఎగిరి కిందపడింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఆయిల్ ట్యాంక్‌లు పేలడంతో దట్టమైన పొగతో ఆకాశమంతా నల్లగా మారిపోయింది. దీంతో మాస్కోలోని పలు ప్రాంతాల్లో బ్లాక్ రెయిన్ పడినట్లు ఇంటర్నేషనల్ మీడియా వెల్లడించింది. రీఫైనరీ నుంచి వెలువడిన పొగ, బూడిద కణాలు వర్షపు చినుకులతో కలిసి మాస్కోలోని బాలాశిఖా, ల్యూబెర్ట్సీ పట్టణాలపై పడినట్లు తెలిపింది. వెహికల్స్, రోడ్లు, భవనాలపై ఆయిల్ పొర పేరుకుపోయిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.
బ్లాక్ రెయిన్ కారణంగా తలుపులు.. కిటికీలు మూసుకోవాలని, పిల్లలు, వృద్ధులు, శ్వాసకోశ సమస్యలున్నవాళ్లు బయటకు రావొద్దని అధికారులు అనౌన్స్ చేశారు. ఆయిల్‌తో కలిసి పడుతున్న రెయిన్ వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు రావొచ్చని హెచ్చరించారు.
ఎయిర్‌పోర్టులు మూత
మాస్కోకు అవసరమయ్యే 40 శాతం పెట్రోల్, 50 శాతం డీజిల్ ఈ రిఫైనరీ నుంచే సరఫరా అవుతుందని ఆ దేశ అధికారులు తెలిపారు. ప్రస్తుతం రీఫైనరీ ఫ్యాక్టరీ దెబ్బతినడంతో నగరంలోని కొన్ని రోడ్లు మూసివేశారు. డ్రోన్ దాడుల ఎఫెక్ట్‌తో మాస్కోలోని ఎయిర్‌పోర్టులను కూడా తాత్కాలికంగా మూసివేశారు. వందలాది విమాన సర్వీసులను రద్దు చేసి ఎయిర్‌పోర్టుల్లో ఉన్న ప్యాసింజర్లను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మాస్కో నగరం పరిధి జొకోవ్‌స్కీ జిల్లాల్లోని ఓ షాపింగ్ సెంటర్, ఎత్తైన నివాస భవనంపైనా డ్రోన్ దాడులు జరగడంతో అగ్నిప్రమాదాలు సంభవించాయి.
ఈ ఘటనల్లో ఇద్దరు చిన్నారులతోపాటు మొత్తం 17 మంది గాయపడినట్లు మాస్కో గవర్నర్ ఆండ్రే వొరోబ్యోవ్ వెల్లడించారు. కాగా, ఈ దాడిని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్‌స్కీ సమర్థించుకున్నారు. తమ దేశంపై రష్యా చేస్తున్న దాడులకు ఇదే సమాధానం అని పేర్కొన్నారు. ఉక్రెయిన్ దగ్ధమైతే మాస్కోకు కూడా అదే గతి పడుతుందని హెచ్చరించారు. మరోవైపు, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ స్పందిస్తూ, తీవ్ర ప్రతీకార చర్యలు తప్పవని ఉక్రెయిన్‌ను హెచ్చరించారు.
