2023లో చనిపోయిన వ్యక్తికి 2024లో పెళ్లి..కల్యాణలక్ష్మి కోసం అడ్డదారులు

2023లో చనిపోయిన వ్యక్తికి 2024లో పెళ్లి..కల్యాణలక్ష్మి కోసం అడ్డదారులు
  • భూర్గంపాడు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్​లో పుట్టుకొస్తున్న దొంగ పత్రాలు

మణుగూరు, వెలుగు: ప్రభుత్వం పేదల కోసం అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి పథకం పక్కదారి పడుతోంది. చనిపోయిన ఓ వ్యక్తిని ఏడాది తరువాత బతికించి, పెళ్లి జరిగినట్లు పత్రాలు సృష్టించడం కలకలం రేపుతోంది. నిబంధనల ప్రకారం పెళ్లి జరిగిన తరువాత ఆధార్  కార్డులు,పెళ్లి ఫొటోలతో సబ్  రిజిస్ట్రార్  ఆఫీస్​లో అందజేసి, పెళ్లి జంటతో పాటు ఇరువైపులా పెద్ద మనుషులు సాక్షి సంతకాలు చేస్తేనే మ్యారేజీ సర్టిఫికెట్​ అందించాలి. 

అయితే రిజిస్ట్రార్  ఆఫీస్​లో దొర్లిన తప్పుతో ఏడాది కింద చనిపోయిన వ్యక్తికి పెళ్లి చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని శివలింగాపురం గ్రామానికి చెందిన పట్నాల సాయి కుమార్  2019లో చర్చి ప్రాంతానికి చెందిన  ఇదునూరి సాయి ప్రసన్నను పెళ్లి చేసుకున్నాడు. 

వారికి ఒక బాబు కూడా ఉన్నాడు. 2023 సెప్టెంబర్​ 19న సాయికుమార్  ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తల్లి శైలజ ఫిర్యాదు మేరకు మణుగూరు పోలీసులు వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు కేసు నమోదైంది. ఇంత జరిగిన తరువాత సాయి కుమార్  2024 మే 20న సాయిప్రసన్నను పెళ్లి చేసుకున్నట్లు సబ్  రిజిస్ట్రార్  ధ్రువీకరించారు. 

ఈ పత్రాలను పరిశీలించకుండానే రెవెన్యూ ఆఫీసర్లు సాయిప్రసన్న తల్లి సత్యవతి పేరిట చెక్కు జారీ చేశారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపితే, మరిన్ని అక్రమాలు వెలుగులోకి వస్తాయని అంటున్నారు.