సినీ, రాజకీయ రంగాల్లో మచ్చలేని వ్యక్తి

సినీ, రాజకీయ రంగాల్లో మచ్చలేని వ్యక్తి

హైదరాబాద్, వెలుగు : దివంగత సినీనటుడు కృష్ణంరాజు వివాదాలకు ఎప్పుడూ దూరంగా ఉండేవారని రక్షణ శాఖ మంత్రి రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నాథ్ సింగ్  అన్నారు. ఆయన తన 55 ఏళ్ల సినీ కెరీర్ లో ఎన్నో మంచి సినిమాలు చేశారని, అలాంటి వ్యక్తి ఇప్పుడు మన మధ్య లేకపోవడం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటని రాజ్ నాథ్ విచారం వ్యక్తం చేశారు. కృష్ణంరాజు తనకు ఆత్మీయ మిత్రుడని, ఢిల్లీలో ఎప్పుడు కలిసినా ఆప్యాయంగా మాట్లాడేవారని గుర్తుచేసుకున్నారు. శుక్రవారం జూబ్లీహిల్స్  జేఆర్సీ కన్వెన్షన్ లో క్షత్రీయ సేవా సమితి ఆధ్వర్యంలో  కృష్ణంరాజు సంతాప సభ జరిగింది. రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నాథ్  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లడారు. కృష్ణంరాజు పెద్ద స్టార్ అయినప్పటికీ తనను అన్నగారని పిలిచేవారని తెలిపారు. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ ని, కృష్ణంరాజుని ప్రత్యేకంగా అభినందించామని చెప్పారు. మరో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ..కృష్ణంరాజుతో తనకు  మంచి అనుబంధం ఉందని, ఇటీవలే  తనకు ఫోన్ చేసి తాను ప్రధాని నరేంద్ర మోడీని కలవాలని చెప్పారని వెల్లడించారు.

వైజాగ్ లో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు రాలేకపోయినందుకు ఆయన చాలా బాధపడ్డారని తెలిపారు. సినీ, రాజకీయ రంగాల్లో ఆయన మచ్చలేని వ్యక్తి  అని కొనియాడారు. పార్టీలకు అతీతంగా అందరితోనూ మంచి సంబంధాలు కలిగి ఉన్నారని చెప్పారు. రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ  మర్యాదకు మారుపేరు కృష్ణంరాజు అని అన్నారు. తన 55 ఏళ్ల తన సినీ ప్రస్థానంలో ఎన్నో మంచి సినిమాలు చేశారని ప్రశంసించారు. కృష్ణంరాజు మంచితనం హీరో ప్రభాస్ కు  వచ్చిందన్నారు. కేసీఆర్ తో  కృష్ణంరాజుకు మంచి అనుబంధం ఉండేదన్నారు. ఫిల్మ్ నగర్ లో  ఆయన  విగ్రహం ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అంతకుముందు జూబ్లీహిల్స్ లోని కృష్టంరాజు నివాసానికి వెళ్లిన రాజ్ నాథ్ సింగ్... ప్రభాస్ తో పాటు కృష్టంరాజు కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన వెంట కిషన్ రెడ్డి, లక్ష్మణ్​, చింతల రామచంద్రా రెడ్డి, తదితరులు ఉన్నారు. అంతకు ముందు హైదరాబాద్ వచ్చిన రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నాథ్ సింగ్ కు బేగంపేట్ఎయిర్ పోర్టులో బీజేపీ ఎంపీ లక్ష్మణ్, మాజీ ఎంపీ, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి స్వాగతం పలికారు.