- ఐదు కుక్కలు అగ్రెసివ్‌గా ఉంటే 95 కుక్కలను చంపేస్తరా?: నటి రేణు దేశాయ్
- ఎవరో ఒకరు అత్యాచారం చేస్తే.. మగవాళ్లందరినీ చంపేయలేం కదా!
- ప్రభుత్వాల వైఫల్యం వల్లే కుక్కల బెడద
- ఇలా మాట్లాడినందుకు నన్ను జైలులో పెట్టినా పర్వాలేదు
- కామారెడ్డిలో కుక్కలను చంపడం అమానవీయమని మండిపాటు
హైదరాబాద్‌సిటీ/పంజాగుట్ట, వెలుగు: కుక్క కాటు వల్ల మనిషి చనిపోతే వేగంగా స్పందిస్తున్న వ్యవస్థలు.. రోడ్డు ప్రమాదాలు, హత్యలు, అత్యాచారాలు, లైంగిక దాడులపై ఎందుకు స్పందించడం లేదని సినీ నటిరేణూ దేశాయ్ ప్రశ్నించారు. సోమవారం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో యాంకర్ రష్మితో కలిసి ఆమె మాట్లాడారు.
‘‘100 కుక్కల్లో ఐదు మాత్రమే అగ్రెసివ్‌గా ఉంటాయి. అలాంటి ఐదు కుక్కల కోసం మిగిలిన 95 కుక్కలను చంపడం సరైంది కాదు. 2019లో దోమ కాటు వల్ల నాకు డెంగీ వచ్చింది. చనిపోయినంత పనైంది. ప్రభుత్వం అప్పుడు దోమల నివారణకు ఏం చేసింది? ఇటీవల వందల కుక్కలను చంపి వాటి పక్కన ఫొటోలు దిగారు. నిద్ర లేచిన దగ్గరి నుంచి కాలభైరవుడిని పూజిస్తారు. మరోవైపు కుక్కలను చంపుతారు. కర్మ ఎవరినీ విడిచిపెట్టదు.
ఎవరో ఒకడు అత్యాచారానికి పాల్పడ్డాడని మగవాళ్లందరినీ చంపేయలేం కదా. నేను ఇలా మాట్లాడినందుకు నన్ను జైలులో పెట్టనివ్వండి. పర్వాలేదు.. ఇటీవల కామారెడ్డి జిల్లాలో ఓ సర్పంచ్ వందల కుక్కలను చంపడం అమానవీయం కాదా? కుక్కలవి మాత్రం ప్రాణాలు కాదా? కుక్కే కాదు.. ఆవు, గేదె, పిల్లి, కోతి అన్నీ కూడా ప్రాణులే కదా? వీధి కుక్కల సంఖ్య పెరగడానికి మన చుట్టూ అపరిశుభ్ర పరిస్థితులే కారణం. ప్రభుత్వాల వైఫల్యాల వల్లే వీధి కుక్కల సమస్య తలెత్తుతోంది’’అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రతి జీవికి జీవించే హక్కు ఉంది..
సమాజంలో ప్రతి జీవికి జీవించే హక్కు ఉందని, నిస్సహాయ జంతువులను చంపడం తప్పని రేణు దేశాయ్ ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్జా తీయ ప్రమాణాల ప్రకారం యానిమల్ బర్త్ కంట్రోల్ పద్ధతి, వ్యాక్సినేషన్లు వేస్తే సమస్య పరి ష్కారమవుతుందన్నారు. హానికర కుక్కలుంటే తమకు గాని, జీహెచ్‌ఎంసీకి గాని చెప్తే వచ్చి తీసుకువెళ్తామన్నారు. న్యాయస్థానాలు వెలువ రించిన తీర్పులను తప్పుగా అర్థం చేసుకుని, కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాల తప్పుడు విధానాలతో కుక్కలను చంపే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని ఆరోపించారు.
కుక్కలను చంపే కార్యక్రమాలకు వెంటనే ముగింపు పలకాలని ఆమె డిమాండ్ చేశారు. మరోవైపు, ప్రెస్ క్లబ్‌లో కుక్కల గురించి మాట్లాడిన వీడియోపై సోషల్ మీడియాలో ట్రోల్స్జరగడం, విమర్శించడం, యూట్యూబ్ థంబ్ నెయిల్స్‌పై రేణు దేశాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రెస్ మీట్ అనంతరం ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో పోస్ట్ చేస్తూ, తనను, తన పిల్లలను అనవసరంగా రాజకీయా ల్లోకి లాగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
