పేదల భూములు ఆక్రమించే హక్కు మీకెక్కడిది?..వెలుగుమట్ల భూములను పెద్దలకు కట్టబెట్టే కుట్ర: కవిత

పేదల భూములు ఆక్రమించే హక్కు మీకెక్కడిది?..వెలుగుమట్ల భూములను పెద్దలకు కట్టబెట్టే కుట్ర: కవిత
  • పేదలంటే కాంగ్రెస్​ సర్కారుకు లెక్కలేకుండాపోయింది
  • కూల్చిన చోటే బాధితులకు ప్రభుత్వం ఇండ్లు కట్టివ్వాలి
  • మేము ఖమ్మంలో ధర్నా చేస్తే.. టెర్రరిస్టుల్లాగా హైదరాబాద్‌‌‌‌కు తరలించిన్రు
  • వెలుగుమట్ల బాధితుల తరఫున జాగృతి ఆఫీసులో కవిత నిరాహార దీక్ష
  • వందలాది పేదల బతుకులను ప్రభుత్వం కూల్చేసిందంటూ రాహుల్‌‌‌‌కు లేఖ

హైదరాబాద్/ ఖమ్మం టౌన్, వెలుగు:  ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో భూముల రేట్లు పెరగడంతో పేదల ఇండ్లను కూల్చి ఆ స్థలాన్ని పెద్దలకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోం దని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. పేదల భూములను కాపాడాల్సిన ప్రభుత్వమే.. వారి భూములను కబ్జా చేస్తున్నదని మండిపడ్డారు. భూదాన్ భూములను ఆక్రమించుకునే హక్కు ప్రభుత్వానికి ఎక్కడిదని నిలదీశారు.

వెలుగుమట్లలో ఇండ్లను కూల్చిన చోటే కొత్త ఇండ్లు కట్టిస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రభుత్వం హామీ ఇచ్చే వరకు తన నిరాహారదీక్ష కొనసాగుతుందని తేల్చి చెప్పారు. మంగళవారం హైదరాబాద్‌‌‌‌ బంజారాహిల్స్‌‌‌‌లోని జాగృతి ఆఫీసులో వెలుగుమట్ల బాధితుల తరఫున ఆమె నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగం పట్టుకుని మాట్లాడే రాహుల్ గాంధీ.. వెలుగుమట్ల వ్యవహారంపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.

రాహుల్ గాంధీ వాస్తవాలు తెలుసుకోవాలని, స్వతంత్ర న్యాయ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ‘‘రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ సర్కారు పేదల ఇండ్లు కూల్చేస్తూ అన్యాయంగా వ్యవహరిస్తోంది. పేదలంటే లెక్క లేకుండా పోయింది. అడిగే వాళ్లు లేరనుకుంటున్నారా? వెలుగుమట్ల కూల్చివేతల వెనుక ముగ్గురు మంత్రులు ఉన్నారని అనుకోవాల్సి వస్తుంది. ఈ వ్యవహారంపై ఖమ్మం జిల్లాలోని ముగ్గురు మంత్రులు, సీఎం స్పందించాలి. భూదాన్ భూమి అంటేనే పేదవాళ్లకు ఇచ్చిన భూమి.

కానీ, పేదవాళ్లకు ఇచ్చిన భూమిలో ప్రభుత్వం, కలెక్టర్ కర్కషంగా వ్యవహరించారు. టెన్త్, ఇంటర్ ఎగ్జామ్స్ ఉండే ఇలాంటి సమయంలో అర్ధరాత్రి బుల్డోజర్లతో 750 ఇండ్లను కూలగొట్టారు. విద్యార్థుల హాల్ టికెట్లు ఉన్న ఇండ్లను కూడా కూల్చేశారు. ఇప్పుడు ఆ విద్యార్థులు ఎగ్జామ్స్ ఎలా రాయాలి?’’అని ఆమె ప్రశ్నించారు.  ‘‘ప్రభుత్వం నుంచి కనీసం ఏదైనా ప్రకటన వస్తుందేమోనని భావించి.. అంబేద్కర్ విగ్రహం సాక్షిగా నిరాహార దీక్ష చేపట్టాం.

నిన్నటి నుంచి దీక్ష చేస్తుంటే 600 మంది పోలీసులు వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేశారు. మేమేదో టెర్రరిస్టులమన్నట్లుగా మమ్మల్ని హైదరాబాద్‌‌‌‌కు తీసుకొచ్చారు. విశారదన్‌‌‌‌ను ఎక్కడకు తీసుకెళ్లారో తెలియదు. ఆచూకీ తెలిశాక ఆయన కూడా పోరాటం చేస్తారు’’అని అన్నారు. భూదాన్ బోర్డు పేదలకు ఇచ్చిన ఆ స్థలాలకు పట్టాలు కూడా ఉన్నాయని, జీవో 58 కింద వాళ్లు రెగ్యులరైజేషన్ కోసం దరఖాస్తు కూడా చేసుకున్నారని ఆమె తెలిపారు. 

తెలంగాణలో బుల్డోజర్‌‌‌‌‌‌‌‌ రాజకీయాలు కనిపించట్లేదా? 

వెలుగుమట్ల బాధితుల విషయంలో జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తూ మంగళవారం కాంగ్రెస్‌‌‌‌ అగ్రనేత రాహుల్ గాంధీకి కవిత లేఖ రాశారు. రాత్రికిరాత్రే పేదల ఇండ్లను కూల్చి 2 వేల మందికి గూడులేకుండా చేశారన్నారు. వెలుగుమట్ల భూదాన్ భూముల్లో ఎన్నో ఏండ్లుగా చాలా మంది పేదలు నివసిస్తున్నారని, ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ భూదాన్ బోర్డు వారికి పట్టాలిచ్చిందని గుర్తుచేశారు. కానీ, ప్రభుత్వం మాత్రం నిమిషాల్లో ఆ ఇండ్లను కూల్చివేసిందన్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత అమానవీయంగా ప్రవర్తిస్తున్నా.. ఆ పార్టీ జాతీయ నాయకత్వం స్పందించకపోవడం దారుణమని ఆమె మండిపడ్డారు. ‘‘గతంలో మీరే పేదల ఇండ్ల కూల్చివేతపై మాట్లాడారు. దేశంలో జరిగిన బుల్డోజర్ రాజకీయాలకు వ్యతిరేకంగా గళమెత్తారు. కానీ, తెలంగాణలో మీ ప్రభుత్వమే ఇలాంటి బుల్డోజర్ రాజకీయాలు చేస్తున్నా మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు. వెంటనే మీరు జోక్యం చేసుకుని పేదలకు న్యాయం చేయాలి. కూల్చిన ఇండ్ల స్థానంలోనే వారికి ఇండ్లను కట్టించేలా చూడాలి’’అని లేఖలో రాహుల్‌‌‌‌ను కవిత డిమాండ్ చేశారు. 

ఖమ్మంలో కవిత దీక్ష భగ్నం..

వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా సోమవారం రాత్రి ఖమ్మంలోని అంబేద్కర్‌‌‌‌‌‌‌‌ భవనంలో కవిత చేపట్టిన నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్‌‌‌‌ చేస్తూ విశారదన్‌‌‌‌తో కలిసి దీక్ష చేపట్టిన కవితను మంగళవారం ఉదయం పోలీసులు దీక్ష స్థలానికి వచ్చి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కవితను, విశారదన్‌‌‌‌ను హైదరాబాద్‌‌‌‌కు తరలించారు.