హైదరాబాద్ సిటీ, వెలుగు : హోర్డింగులు, యూనిపోల్స్విషయంలో అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీలు, జీహెచ్ఎంసీ మధ్య వార్ నడుస్తోంది. జీహెచ్ఎంసీ విస్తరణ తర్వాత విలీనమైన ప్రాంతాల్లో హోర్డింగ్స్, యూనిపోల్స్ అడ్వర్టైజ్ మెంట్ ఏర్పాటు చేయొద్దని 250 నుంచి 300 ఏజెన్సీలకు బల్దియా నోటీసులిచ్చింది. కాదని పెడితే తామే తొలగిస్తామని స్పష్టం చేసింది.
2020లోనే పాత బల్దియా పరిధిలో హోర్డింగ్స్, యూనిపోల్స్ బ్యాన్చేశారు. ఇప్పుడు జీహెచ్ఎంసీ విస్తరించడంతో ఇదే చట్టం అక్కడ కూడా వర్తించనున్నది. ఈ నేపథ్యంలో నోటీసులివ్వడంతో ఏజెన్సీలు మండిపడుతున్నాయి. విలీనం కానీ ప్రాంతాల్లో 2023 వరకు ట్యాక్స్ కలెక్ట్ చేసి అనుమతులిచ్చినా తర్వాత బ్యాన్ చేశారు. ఇప్పుడు కొత్త పాలసీ వచ్చేవరకు ఆగాలని, అప్పటివరకు తొలగించవద్దని ఏజెన్సీలు కోరుతున్నాయి.
ఈ మేరకు శుక్రవారం జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులో అడ్వర్టైజ్ మెంట్ డిప్యూటీ కమిషనర్ పద్మకి తెలంగాణ అవుట్‌డోర్ మీడియా ఓనర్స్ అసోసియేషన్(టోమో) తరపున ఏజెన్సీల నిర్వాహకులు వినతిపత్రం ఇచ్చారు. పెద్ద యాడ్ ఏజెన్సీలు ఇష్టానుసారంగా కొనసాగిస్తున్నారని, కేవలం చిన్న ఏజెన్సీలైన తాము రోడ్డున పడుతున్నామంటున్నారు. దీనిపై సోమవారం అడిషనల్ కమిషనర్ అనురాగ్ జయంతితో సమావేశం నిర్వహించనున్నారు.
