- గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా, ఏఐ డేటా సెంటర్ల విద్యుత్ డిమాండ్ తీర్చడమే లక్ష్యం
న్యూఢిల్లీ: అదానీ గ్రూప్‌కు చెందిన విద్యుత్ సరఫరా, పంపిణీ సంస్థ అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్ (ఏఈఎస్‌ఎల్) ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు రూ. 8,500 కోట్ల విలువైన భారీ ఇంటర్-స్టేట్ పవర్ ట్రాన్స్‌మిషన్ ప్రాజెక్ట్‌ను దక్కించుకుంది. దీంతో కంపెనీ మొత్తం ఆర్డర్ బుక్ విలువ రూ. 80 వేల కోట్లకు చేరింది. క్యాపిటల్ ట్రాన్స్‌మిషన్ నెట్‌వర్క్‌లను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన టారిఫ్- బేస్డ్ కాంపిటీటివ్ బిడ్డింగ్ (టీబీసీబీ) విధానం కింద ఈ ప్రాజెక్టును దక్కించుకుంది.
విశాఖపట్నం ప్రాంతంలో రాబోతున్న గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టులకు అవసరమైన విద్యుత్‌ను పంపిణీ చేయడమే ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశ్యం. పెందుర్తి- విశాఖపట్నం రీజియన్‌లో వేగంగా పెరుగుతున్న డేటా సెంటర్లు, డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పెట్టుబడుల వలన ఏర్పడే విద్యుత్ డిమాండ్‌ను కూడా ఇది బ్యాలెన్స్ చేస్తుంది. 'విశాఖ పవర్ ట్రాన్స్‌మిషన్ లిమిటెడ్' అనే స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్‌పీవీ) ద్వారా ఈ ప్రాజెక్టు అమలు కానుంది.
ఇందులో భాగంగా పెందుర్తి (విశాఖ) వద్ద 765/400 కేవీ జీఐఎస్ సబ్‌స్టేషన్, ఖమ్మం-II వద్ద మరొక 765/400 కేవీ సబ్‌స్టేషన్ నిర్మిస్తారు. తెలంగాణలోని పవర్ ప్లాంట్ల నుంచి కరెంట్ నేషనల్ గ్రిడ్లకు చేరుతుంది. అక్కడి నుంచి ఖమ్మం సబ్‌స్టేషన్‌కి, ఆ తర్వాత అదానీ పవర్ ట్రాన్స్‌మిషన్ లైన్ల ద్వారా విశాఖకు చేరుతుంది. ఈ మొత్తం ప్రాజెక్ట్‌ను 30 నెలల (రెండున్నర ఏళ్లు) వ్యవధిలో పూర్తి చేయాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్ట్ చేరడంతో అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ నెట్‌వర్క్ భారీగా విస్తరించింది. కొత్తగా 1,582 సర్క్యూట్ కిలోమీటర్ల (సీకేఎం) ట్రాన్స్‌మిషన్ లైన్లు జతకానున్నాయి. 10,500 ఎంవీవీ (మెగావోల్ట్ ఆంపియర్) పరిమాణంలో ట్రాన్స్‌ఫార్మేషన్ కెపాసిటీ పెరుగుతుంది. దీంతో సంస్థ మొత్తం ట్రాన్స్‌మిషన్ నెట్‌వర్క్ 29,531 సీకేఎంకి, మొత్తం ట్రాన్స్‌ఫార్మేషన్ కెపాసిటీ 1,33,675 ఎంవీఏకి చేరనుంది.
