- తిన్నింటి వాసాలు లెక్క పెట్టే వ్యక్తి మా సీఎం కాదు: ఆది శ్రీనివాస్
- ఖమ్మం సభలో టీడీపీ గురించి రేవంత్ మాట్లాడితే హరీశ్‌కు ఉలుకెందుకని ప్రశ్న
హైదరాబాద్, వెలుగు: ఖమ్మం సభలో టీడీపీ గురించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడితే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఎందుకు ఉలిక్కి పడుతుండని విప్ ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. టీడీపీపైన అభిమానం చూపిస్తున్నారని, కాంగ్రెస్‌కు ద్రోహం చేస్తున్నారని, ఆయనేదో ఊహించుకొని తెగ బాధపడిపోతున్నాడని ఆదివారం ఒక ప్రకటనలో ఎద్దేవా చేశారు. మా సీఎంకు తిన్నింటి వాసాలు లెక్కపెట్టే అలవాటు లేదని, ఈ విషయం హరీశ్ తెలుసుకోవాలన్నారు. “అన్నం పెట్టిన వాళ్లని మరిచిపోయి వాళ్లకు సున్నం పెట్టే అలవాటు లేదు.
నీడనిచ్చిన చెట్టును నరికే వ్యక్తిత్వం కాదు మా సీఎంది. ఆయనకు రాజకీయ జన్మనిచ్చిన టీడీపీని తెలంగాణలో లేకుండా చేసిన చరిత్ర మీ మామ కేసీఆర్‌ది. తెలంగాణ ప్రయోజనాల కోసం తనకు రాజకీయంగా అండగా నిలిచిన టీడీపీని హుందాగా విడిచి కాంగ్రెస్‌లో చేరి, మీలాంటి దోపిడీదారులపై పోరాడి సీఎం అయ్యారు. తెలంగాణ ఉద్యమ సమయంలో మీ రాజకీయాల కోసం టీడీపీ, కాంగ్రెస్ దిమ్మెలను కూల్చమని పిలుపునిచ్చింది మీరు కాదా? మీ గద్దెలను, దిమ్మెలను మేం కూల్చాల్సిన అవసరం లేదు.. తెలంగాణ ప్రజలే మిమ్మల్ని కుప్పకూల్చి ఫామ్‌హౌస్‌లో కూర్చోబెట్టారు.
మా సీఎంకి వెన్నుపోట్లు తెలియవు.. వెన్ను చూపించడం తెలియదు.. బరి గీసి కొట్లాడటమే తెలుసు. హరీశ్ రావు.. నువ్వు మామ చాటు అల్లుడిలా నటిస్తూ ఆ నాటి సీఎం వైఎస్‌కు బొకే ఇచ్చిన నీ బాగోతం అందరికి తెలుసు. వైఎస్ చనిపోకపోతే నీ వెన్నుపోటు రాజకీయాలు ఆనాడే బయటపడేవి. నువ్వో గురిగింజ.. నీ నలుపు నీకు తెలియడం లేదు. బీజేపీపైన నిలబడి నిక్కచ్చిగా పోరాడుతున్నది మా సీఎం” అని ఆది శ్రీనివాస్ అన్నారు. హరీశ్ రావు.. మా వైపు ఒక వేలు ఎత్తి చూపిస్తే తెలంగాణ ప్రజల లక్షల గొంతులు మీ చెత్త చరిత్రను బయట పెడ్తాయని హెచ్చరించారు.
