- అధికారులకు కలెక్టర్ల ఆదేశం
ఆదిలాబాద్/నిర్మల్, వెలుగు: మున్సిపల్ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలని, ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదిలాబాద్జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆదిలాబాద్ మున్సిపాలిటీ ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు ట్రైనింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ప్రక్రియలో ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారుల పాత్ర ఎంతో కీలకమన్నారు.
పోలింగ్ రోజున కేంద్రాల్లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా, ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా విధులు నిర్వహించాలన్నారు. ఎన్నికల నియమావళి, బ్యాలెట్ బాక్సుల వినియోగం, పోలింగ్ సమయాల్లో అనుసరించాల్సిన విధానాలపై పూర్తి అవగాహన ఉండాలన్నారు. సమావేశంలో ఎన్నికల సాధారణ పరిశీలకులు హనుమంత్ నాయక్, అడిషనల్ కలెక్టర్ రాజేశ్వర్, మున్సిపల్ కమిషనర్ రాజు, నోడల్ అధికారులు మనోహర్, ఫణిందర్, మాస్టర్ ట్రైనర్ లక్ష్మణ్, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
కౌంటింగ్ ఏర్పాట్లు పక్కాగా ఉండాలి..
మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను పారదర్శకంగా, పటిష్ట భద్రత మధ్య నిర్వహించాలని మంచిర్యాల కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాలను సోమవారం ఆమె పరిశీలించారు. నిర్మల్, భైంసా, ఖానాపూర్ మున్సిపాలిటీలకు కేటాయించిన స్ట్రాంగ్ రూమ్‌లను తనిఖీ చేసి చేపట్టిన భద్రతా చర్యలపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. లెక్కింపునకు అవసరమైన సిబ్బందిని ముందుగానే కేటాయించాలని, గదుల్లో సరిపడా టేబుళ్లు ఏర్పాటు చేయాలని సూచించారు.
అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక సీటింగ్ సదుపాయం కల్పించాలన్నారు. ప్రశాంత వాతావరణంలో లెక్కింపు ప్రక్రియను పూర్తిచేయాలని సూచించారు. అడిషనల్ కలెక్టర్ కిశోర్ కుమార్, భైంసా సబ్ కలెక్టర్ సంకేత్ కుమార్, మున్సిపల్ కమిషనర్లు జగదీశ్వర్ గౌడ్, సుందర్ సింగ్, తహసీల్దార్ రాజు తదితరులు ఉన్నారు.
