నాలుగేళ్ల విరామం తర్వాత.. సైబీరియన్ కొంగలొచ్చినయ్..

నాలుగేళ్ల విరామం తర్వాత.. సైబీరియన్ కొంగలొచ్చినయ్..

సుమారు ఐదు వేల కిలోమీటర్ల దూరంలోని సైబీరియా ప్రాంతం నుంచి మరోసారి ఎర్ర కాళ్ల కొంగలు ఖమ్మం జిల్లా చింతపల్లికి చేరుకున్నాయి. ప్రతి ఏడాది జనవరి నుంచి జులై మధ్య ఈ పక్షులు చింతపల్లికి వచ్చి గుడ్లు పెట్టి పిల్లలను పెంచుకుంటాయి. తర్వాత వెళ్లిపోతాయి. నాలుగేండ్లుగా కోతుల బెడద కారణంగా గ్రామస్తులు చింత చెట్ల కొమ్మలు నరకడంతో ఈ పక్షులు గ్రామానికి దూరమయ్యాయి. మళ్లీ ఆ కొమ్మలు పెరగడంతో ఈ ఏడాది కొంగలు సందడి చేస్తున్నాయి.  

ఖమ్మం జిల్లా చింతపల్లి గ్రామం మరోసారి అతిథి పక్షులతో సందడిగా మారింది. సుమారు ఐదు వేల కిలోమీటర్ల దూరంలోని సైబీరియా ప్రాంతం నుంచి వచ్చే పెయింటెడ్ స్టార్కు(ఎర్ర కాళ్ల కొంగ)లు నాలుగేళ్ల విరామం తర్వాత గ్రామానికి చేరుకున్నాయి. ప్రతీ సంవత్సరం జనవరి నుంచి జూలై వరకు ఈ పక్షులు చింతపల్లిలో గుడ్లు పెట్టి పిల్లలను పెంచుతాయి. సమీపంలోని చెరువులు, పాలేరు, వైరా జలాశయాల్లో ఆహారం పొందుతూ ఇక్కడే నివాసం ఉంటాయి. 

గతంలో కోతుల బెడద కారణంగా గ్రామస్తులు చింత చెట్ల కొమ్మలు తొలగించడంతో ఈ పక్షులు గ్రామానికి దూరమయ్యాయి. మళ్లీ ఇప్పుడు పెద్ద సంఖ్యలో అవిరావడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా అటవీశాఖ అధికారి సిద్ధార్థ విక్రమ్ సింగ్ గ్రామాన్ని సందర్శించి పక్షులకు ఎలాంటి హాని కలిగించవద్దని ప్రజలకు సూచించారు. కొంగల రాకను శుభసూచికంగా భావించే చింతపల్లి గ్రామం ఇప్పుడు మరోసారి ఆ కొంగల తాకిడితో ఆనందంలో మునిగిపోయింది. – ఖమ్మం/ఫొటోగ్రాఫర్​, వెలుగు