కేంద్రం ప్రభుత్వ రంగ కంపెనీలన్నింటినీ అమ్మేస్తున్నది

కేంద్రం ప్రభుత్వ రంగ కంపెనీలన్నింటినీ అమ్మేస్తున్నది

ఎల్ బీ నగర్, వెలుగు: ‘‘రాష్ట్రం పచ్చగా ఉంటేనే మనం బాగుంటాం. కేసీఆర్ ఆధ్వర్యంలో మనం అన్ని రంగాల్లో మంచిగున్నాం. పచ్చగా ఉన్న రాష్ట్రంలో పచ్చని పంటలు పండాల్నా.. మతం పేరిట మంటలు మండాల్నా ప్రజలే చెప్పాలి’’ అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం దోచుకుంటున్నదని ఆరోపించారు. సెస్సులు రద్దు చేసి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. గతంలో సిలిండర్ ధర రూ.400 ఉంటే ఇప్పుడు రూ.1,200కి పెంచారని ఫైరయ్యారు. రంగారెడ్డి జిల్లా మన్నెగూడలోని బీఎంఆర్ సార్థ ఫంక్షన్ హాల్‌‌లో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన లారీ యజమానులు, డ్రైవర్ల ఆత్మీయ సమ్మేళనానికి మంత్రులు శ్రీనివాస్ గౌడ్, పువ్వాడ అజయ్ కుమార్‌‌‌‌తో కలిసి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్ని వర్గాల అభివృద్ధే టీఆర్ఎస్ లక్ష్యమని చెప్పారు. 

‘‘తెలంగాణ వచ్చిన తర్వాత చాలా మార్పులు జరిగాయి. ఎంతో అభివృద్ధి జరిగింది. ‘మీరు పాలించుకోగలరా?’ అని ఎంతో మంది ప్రశ్నించారు. ఇప్పుడు అభివృద్ధిలో రాష్ట్రం నంబర్ 1గా నిలుస్తున్నది” అని అన్నారు.
నల్గొండ పైసలన్నీ ఒక్కరి ఖాతాలోనే జన్ ధన్ అకౌంట్లలో రూ.15 లక్షలు పడతాయని కేంద్రం చెప్పిందని, కాని ఏ ఒక్క లబ్ధిదారు ఖాతాలో కూడా పైసా పడలేదని కేటీఆర్ విమర్శించారు. నల్గొండ పైసలన్నీ ఒక్కరి ఖాతాలోనే పడ్డాయని, ఆయన ఎవరో ప్రజలకు తెలుసన్నారు. ‘‘గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ వడ్లు పండిస్తున్నామని, వడ్లు కొనాలని ఢిల్లీకి పోయి కేంద్రాన్ని అడిగినం. ‘తెలంగాణలో ఏం చేసినరు.. ఇన్ని వడ్లు ఎట్ల పండినయ్’ అని అన్నరు. తెలంగాణలో నూకలు తినాలని వాళ్లు అన్నరు. నూకలు తినాలన్న వాళ్ల తోకలు కట్ చేయాలి” అని మండిపడ్డారు. కేంద్రంలో దివాలాకోరు పార్టీ ఉందని.. గట్టిగా మాట్లాడితే ‘నువ్వు ద్రోహి’ అంటున్నారని చెప్పారు. ప్రభుత్వ రంగ కంపెనీలన్నింటినీ అమ్మిపారేస్తున్నారని ఆరోపించారు.

నాలుగేండ్లలో ఫ్లోరోసిస్‌‌‌‌ను నయం చేసినం

ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒకప్పుడు ఫ్లోరోసిస్ వ్యాధితో ప్రజలు జీవచ్ఛవాలుగా బతికారని కేటీఆర్ అన్నారు. ‘‘ప్రజలు ఫ్లోరోసిస్ వ్యాధితో బాధపడుతుంటే కేసీఆర్ తట్టుకోలేకపోయారు. నల్గొండలోని అన్ని గ్రామాల్లో పర్యటించి ప్రజలకు ధైర్యం చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఫ్లోరోసిస్‌‌‌‌ను తరిమికొట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. నాలుగేండ్లలో ఫ్లోరోసిస్ ను పూర్తిగా నయం చేశాం. మిషన్ కాకతీయతో చెరువులు బాగు చేసుకున్నాం. ఈ రోజు ఎక్కడికి వెళ్లినా చెరువులు కళకళలాడుతున్నాయి” అని చెప్పారు. తెలంగాణ రాకముందు కరెంటు ఉంటే వార్త అని, ఇప్పుడు 15 నిమిషాల పాటు కరెంటు పోతే వార్త అవుతోందన్నారు. రాష్ట్రంలోని అన్ని సెక్టార్లకు కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనన్నారు.

వాహన రంగం కుదేలు: మంత్రి పువ్వాడ

వాహన రంగం కుదేలవ్వడానికి కేంద్ర ప్రభుత్వమే కారణమని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆరోపించారు. రాష్ట్రంలో కరోనా టైంలో లారీలు తిరగలేదని టాక్స్‌‌‌‌ను కూడా రద్దు చేశామని చెప్పారు. కరోనాతో ఫిట్ నెస్ సర్టిఫికెట్స్ రెన్యూవల్ చేసుకోలేని వారికి రోజుకు 50 రూపాయల చార్జ్ ను సీఎం రద్దు చేశారని చెప్పారు. గ్రీన్ టాక్స్‌‌‌‌ను తగ్గిస్తామన్నారు.

రాజగోపాల్ స్వార్థంతోనే: శ్రీనివాస్ గౌడ్

రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్ట్ కోసమే బీజేపీలో చేరారని, ఆయన స్వార్థం వల్లే మునుగోడు ఉప ఎన్నిక వచ్చిందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. మునుగోడు ఎన్నిక వల్ల అక్కడి ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదని చెప్పారు. జాతీయ రాజకీయాల్లోకి రాకుండా బీఆర్ఎస్ ను ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని మండిపడ్డారు. రాష్ట్రానికి కాబోయే సీఎం కేటీఆర్ అని, ఆయన సీఎం అయ్యాక రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. లారీ ఓనర్లు, డ్రైవర్లు మునుగోడులో టీఆర్ఎస్ కే మద్దతు పలుకుతున్నారని, అక్కడ గెలిచేది తమ అభ్యర్థేనని ధీమా వ్యక్తం చేశారు.

ప్రధానికి కేటీఆర్‌‌‌‌ పోస్ట్‌‌‌‌కార్డ్‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ప్రధాని నరేంద్ర మోడీకి మంత్రి కేటీఆర్‌‌‌‌ శనివారం పోస్ట్‌‌‌‌ కార్డ్‌‌‌‌ రాశారు. చేనేత కార్మికుల సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లేందుకు రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ మోడీకి ఉత్తరాలు రాయాలని పిలుపునిచ్చారు. చేనేత కార్మికుల సమస్యలు మాత్రమే కార్డులో ప్రస్తావించాలని సూచించారు. చేనేత ఉత్పత్తులపై 5% జీఎస్టీని రద్దు చేయాలని డిమాండ్‌‌‌‌ చేశారు. చేనేత కార్మికుల సమస్యలను చాలాసార్లు కేంద్రం దృష్టికి తీసుకెళ్లానని, వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నారు. సీఎం కేసీఆర్ ప్రధాని మోడీకి స్వయంగా పలుమార్లు లెటర్లు రాశారని గుర్తుచేశారు. చేనేత కార్మికులకు వర్తించే అన్ని సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేశారని మండిపడ్డారు. దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో జాతిని ఏకం చేసిన చేనేత వస్త్రాలపై పన్ను వేసిన తొలి ప్రధాని మోడీనేనని దుయ్యబట్టారు. స్వదేశీ మంత్రం, ఆత్మనిర్భర్‌‌‌‌ భారత్‌‌‌‌, నిత్యం గాంధీ మహాత్ముడి సూత్రాలు వల్లెవేసే కేంద్రం.. తాను అనుసరిస్తున్న విధానాలతో ఆ స్ఫూర్తికి తూట్లు పొడుస్తోందన్నారు. దేశంలో వ్యవసాయం తర్వాత అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్న టెక్స్‌‌‌‌టైల్‌‌‌‌ రంగం కార్మికుల గురించి ఆలోచించి జీఎస్టీ రద్దు చేయాలన్నారు.