న్యూఢిల్లీ: ఐపీఎల్ 19లో భాగంగా శుక్రవారం (మే 1) ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ కీలక పోరుకు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు భారీ శుభవార్త అందింది. గాయం కారణంగా టోర్నీ ప్రారంభ మ్యాచులకు దూరమైన స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ రాజస్థాన్‌తో జరగనున్న మ్యాచులో బరిలోకి దిగనున్నాడు. ఈ విషయాన్ని ఢిల్లీ యాజమాన్యం ధృవీకరించింది. భుజం గాయం నుండి కోలుకున్న స్టార్క్ గత వారం జట్టులో చేరాడని.. పూర్తి ఫిట్నెస్ సాధించడంతో ఆర్ఆర్తో జరగనున్న కీలక పోరులో బరిలోకి దిగుతాడని డీసీ మేనేజ్మెంట్ తెలిపింది.
ఢిల్లీకి భారీ ఊరట..!
ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్‌ను రూ.11.75 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే, టోర్నీ ప్రారంభానికి ముందే స్టార్క్ గాయపడ్డాడు. భుజానికి గాయం కావడంతో ఆటకు దూరమయ్యాడు. దీంతో ఐపీఎల్ 2026 ప్రారంభ మ్యాచులకు దూరమయ్యాడు. గాయం నయం కావడంతో గత వారమే ఢిల్లీ జట్టులో చేరాడు.
పూర్తి ఫిట్నెస్ సాధించడంతో శుక్రవారం (మే 1) రాజస్థాన్ రాయల్స్ తో జరగనున్న కీలక పోరులో స్టార్క్ మైదానంలో అడుగుపెట్టనున్నాడు. ఈ సీజన్లో ఇప్పటి వరకు 8 మ్యాచులు ఆడిన డీసీ మూడు విజయాలు, ఐదు ఓటములతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతోంది.
ఫ్లే ఆఫ్స్‌కు చేరుకోవాలంటే ఢిల్లీ ఆడబోయే ఆరు మ్యాచులు తప్పక నెగ్గాల్సిన పరిస్థితి. ఇలాంటి క్లిష్ట సమయంలో స్టార్ పేసర్ స్టార్క్ జట్టులోకి ఎంట్రీ ఇవ్వడం ఢిల్లీకి భారీ ఊరటనే చెప్పొచ్చు. భీకర ఫామ్‌లో ఉన్న రాజస్థాన్ యంగ్ ఓపెనర్స్ వైభవ్ సూర్యవంశీ, యశస్వీ జైశ్వాల్‌ను స్టార్క్ ఏ మేరకు కట్టడి చేస్తాడనేది చూడాలీ.
