అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై చేతబడి.. తరుణ్ భాస్కర్ 'గాయపడ్డ సింహం' ఎలా ఉందంటే?

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై చేతబడి.. తరుణ్ భాస్కర్ 'గాయపడ్డ సింహం' ఎలా ఉందంటే?

తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్.  ఈ మధ్య నటుడిగానూ బిజీ అవుతున్నారు. ఆయన కథానాయకుడిగా, కాశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన సరికొత్త కామెడీ డ్రామా ‘గాయపడ్డ సింహం’. ఫుల్ ప్రమోషన్ తో హైప్ ను తెచ్చుకున్న ఈ మూవీ భారీ అంచనాలతో ఈ రోజు ( మే 1, 2026) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై పగ తీర్చుకోవాలనే ఒక వింత పాయింట్‌తో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు అలరించిందో చూద్దాం..

కథా నేపథ్యం

దరహాస్ (తరుణ్ భాస్కర్) ఒక సాదాసీదా మధ్యతరగతి కుర్రాడు. ఎలాగైనా డల్లాస్ వెళ్లి డాలర్లు సంపాదించి లైఫ్ సెటిల్ చేసుకోవాలనేది అతని కల. కానీ, అప్పట్లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకున్న కొన్ని కఠినమైన వీసా నిబంధనల వల్ల దరహాస్ అమెరికా ఎయిర్‌పోర్ట్ నుంచే వెనక్కి పంపబడతాడు. తన కెరీర్ నాశనం కావడానికి ట్రంపే కారణమని భావించిన దరహాస్, అతనిపై తీవ్రమైన పగ పెంచుకుంటాడు.

మామూలుగా అయితే ఎవరైనా కోర్టుకు వెళ్తారు లేదా సోషల్ మీడియాలో తిడతారు. కానీ మన దరహాస్ మాత్రం వెరైటీగా ట్రంప్‌పై ‘బ్లాక్ మ్యాజిక్’  చేయాలని నిర్ణయించుకుంటాడు. ఇందుకోసం అతను గ్యాంగ్‌స్టర్ బ్రూటల్ ధర్మ (జె.డి. చక్రవర్తి)ని, మరో వింతైన వ్యక్తిని (శ్రీవిష్ణు) కలుస్తాడు. ఈ క్రేజీ మిషన్‌లో అతనికి యూట్యూబర్ శాలిని (ఫరియా అబ్దుల్లా) ఎలా తోడైంది? అసలు హైదరాబాద్ గల్లీలో కూర్చుని వైట్ హౌస్ ప్రెసిడెంట్‌పై చేసిన మంత్రతంత్రాలు పనిచేశాయా? చివరికి దరహాస్ పగ తీరిందా? అన్నదే ఈ సినిమా కథ.

ఎలా ఉందంటే?

దర్శకుడు కాశ్యప్ శ్రీనివాస్ ఎంచుకున్న పాయింట్ నిజంగా చాలా వినూత్నంగా ఉంది. ఒక దేశాధ్యక్షుడిపై సామాన్య భారతీయుడు చేతబడి ద్వారా యుద్ధం ప్రకటించడం అనేది టాలీవుడ్‌లో ఇప్పటివరకు రాని ఐడియా. ప్రథమార్ధంలో పాత్రల పరిచయం, తరుణ్ భాస్కర్ కామెడీ టైమింగ్, డల్లాస్ వెళ్లాలనే తపనతో సాగే సన్నివేశాలు ప్రేక్షకులను బాగా నవ్విస్తాయి. ముఖ్యంగా శ్రీవిష్ణు పాత్ర ప్రవేశించినప్పుడు కథలో వినోదం రెట్టింపు అవుతుందని ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అయితే, ఇంత క్రేజీ ఐడియాను రెండు గంటల పాటు ఆసక్తికరంగా నడిపించడంలో స్క్రీన్ ప్లే తడబడిందన్న టాక్ వినిపిస్తోంది. ద్వితీయార్ధంలో కథనం గాడి తప్పింది. బ్లాక్ మ్యాజిక్ చుట్టూ తిరిగే సన్నివేశాలు సాగదీసినట్లు అనిపిస్తాయి. సెకండ్ హాఫ్ ప్రారంభంలో ఉన్న జోష్, క్లైమాక్స్ వచ్చేసరికి నీరుగారిపోయింది. చివర్లో వచ్చే స్పూఫ్ కామెడీ అంతగా పండలేదని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఒక విభిన్నమైన కథను ప్యారడీ జోన్‌లోకి తీసుకెళ్లడం సినిమాకు మైనస్‌గా మారింది.

ఎవరెవరు ఎలా చేశారంటే?

దరహాస్ పాత్రలో తరుణ్ భాస్కర్ ఒదిగిపోయారు. తన సహజసిద్ధమైన నటనతో సీరియస్ సన్నివేశాల్లో కూడా నవ్వులు పూయించారు. శ్రీవిష్ణు పాత్ర నిడివి తక్కువే అయినా, తన మార్క్ డైలాగ్ డెలివరీతో మెప్పించారు. గ్యాంగ్‌స్టర్‌గాజె.డి. చక్రవర్తి తన గంభీరమైన నటనతో అలరించారు, కానీ ఆయన పాత్రను ఇంకాస్త బలంగా రాసుకోవాల్సింది. హీరోయిన్స్ ఫరియా అబ్దుల్లా , మానస చౌదరిలకు కథలో పెద్దగా స్కోప్ లేదు. గ్లామర్ పరంగా ఓకే అనిపిస్తారు.

 మంచి టైమ్ పాస్ ఆప్షన్..

స్వీకర్ అగస్తీ సంగీతం సినిమా మూడ్‌కు తగ్గట్టుగా ఉంది. విద్యా సాగర్ చింత సినిమాటోగ్రఫీ నీట్‌గా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి కానీ, ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త పడాల్సింది అంటున్నారు సినీ ప్రియులు.. ‘గాయపడ్డ సింహం’ ఒక వింతైన, విభిన్నమైన ప్రయత్నం. లాజిక్కులు వెతకకుండా, కేవలం వినోదం కోసం చూస్తే ఈ వీకెండ్‌కు ఇది ఒక మంచి టైమ్ పాస్ ఆప్షన్. తరుణ్ భాస్కర్ తన కామెడీతో సినిమాను నిలబెట్టే ప్రయత్నం చేశారు.