Jetlee Movie Review: ఆకాశంలో సత్య కామెడీ సర్కస్.. బాక్సీఫీస్ వద్ద 'జెట్లీ' హిట్టా? ఫట్టా?

Jetlee Movie Review: ఆకాశంలో సత్య కామెడీ సర్కస్.. బాక్సీఫీస్ వద్ద 'జెట్లీ' హిట్టా? ఫట్టా?

తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజీ కామెడీ బ్రాండ్ ను క్రియేట్ చేసుకున్నారు దర్శకుడు రితేష్ రానా.  ' మత్తు వదలరా ' సిరీస్ తో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించిన ఆయన.. ఈ సారి కమెడియన్ నటుడు సత్యను హీరోగా పెట్టి తీసిన చిత్రం 'జెట్లీ'. భారీ అంచనాల మధ్య ఈ మూవీ ఈ రోజు ( మే 1, 2026 ) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  కేవలం సత్య కామెడీ టైమింగ్‌పైనే ఆధారపడిన ఈ సినిమా, ఆశించిన స్థాయిలో వినోదాన్ని పండించిందా? లేదా? అనేది రివ్యూలో చూద్దాం.

కథా నేపథ్యం

వ్యాపారవేత్త ప్రజాపతి (అజయ్) రూ. 15,000 కోట్ల భారీ బ్యాంకింగ్ స్కామ్ చేసి దుబాయ్‌కు పరారవుతాడు. అతడిని పట్టుకుని ఇండియాకు తీసుకురావడానికి ఇంటెలిజెన్స్ ఏజెంట్ శివాని రాయ్ (రియా సింఘా) బృందం రంగంలోకి దిగుతుంది. ప్రజాపతిని ఒక ప్రైవేట్ విమానంలో కొచ్చికి తరలిస్తుండగా, అదే ఫ్లైట్‌లో డాక్టర్ వేదవ్యాస్ (సత్య) కూడా ఉంటాడు. అయితే, అనుకోకుండా ఈ విమాన ప్రయాణంలో వేదవ్యాస్ తన గతాన్ని మర్చిపోతాడు. మరోవైపు, ప్రజాపతిని చంపడానికి శత్రువుల నుండి ముప్పు పొంచి ఉంటుంది. అసలు ఈ గందరగోళం మధ్య వేదవ్యాస్ ఎవరు? అతనికి 'జెట్లీ' అనే పేరు ఎలా వచ్చింది? విమానం హైజాక్ నుండి ప్రయాణికులను అతను ఎలా కాపాడాడు? అన్నదే మిగతా కథ.

ఎలా ఉందంటే?

రితేశ్ రానా సినిమాల్లో మీమ్స్, విభిన్నమైన క్యారెక్టరైజేషన్లు సహజం. ఈ సినిమాలో కూడా సత్య మార్క్ హ్యూమర్, వెన్నెల కిశోర్ సినీ సుడోకు వంటి అంశాలు కొత్తగా అనిపిస్తాయి. ప్రథమార్ధంలో జెట్లీ గందరగోళం, ఫ్లైట్ లోని పాత్రల పరిచయంతో కథ సరదాగా సాగిపోతుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ ముందు వచ్చే ఫ్లైట్ యాక్షన్ సీక్వెన్స్, సత్య బాడీ లాంగ్వేజ్ ప్రేక్షకులను అలరిస్తాయి. అయితే, ద్వితీయార్ధం విషయంలోనే సినిమా తడబడింది. కథా గమనం నెమ్మదించడం, విమానం హైజాక్ డ్రామాను అనవసరంగా సాగదీయడం బోర్ కొట్టిస్తుందంటున్నారు ప్రేక్షకులు. రితేశ్ రానా స్క్రిప్ట్‌లో ఉండాల్సిన పదును, వేగం ఈసారి మిస్ అయ్యాయి. ట్విస్ట్‌లు ఇవ్వాలనే ప్రయత్నంలో కథను మరింత గందరగోళంగా మార్చారు. కొన్ని కామెడీ ట్రాక్స్ బలవంతంగా ఇరికించినట్లు అనిపిస్తాయి. ఎడిటింగ్ లోపాలు, రిపీటెడ్ సీన్లు సినిమా నిడివిని పెంచేసి ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెడతాయి.

ఎవరెలా చేశారంటే?

ఈ సినిమాకు అతిపెద్ద బలం సత్య. తన కామెడీ టైమింగ్‌తో, మ్యానరిజమ్స్‌తో సినిమాను భుజాన వేసుకుని నడిపించాడు. ముఖ్యంగా గతం మర్చిపోయిన వ్యక్తిగా ఆయన చేసే కన్ఫ్యూజన్ కామెడీ నవ్వులు పూయిస్తుంది. వెన్నెల కిశోర్ అమాయకమైన నటనతో ఆకట్టుకున్నాడు, కానీ ఆయన పాత్రకు ఇంకా మంచి డైలాగ్స్ పడితే బాగుండేది. రియా సింఘా సీరియస్ ఏజెంట్‌గా సరిపోయింది. అజయ్, వైవా హర్ష, శ్రీనివాస్ రెడ్డి తమ పరిధి మేరకు నటించారు.

బ్యాక్ గ్రౌండ్ స్కోర్ 

ఈ కామెడీ మూవీకి కొన్ని ప్లస్ లు , మైనస్ లు కూడా ఉన్నాయి.. సత్య అద్భుతమైన కామెడీ టైమింగ్ కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.. ఇంటర్వెల్ బ్యాంగ్ , ఫ్లైట్ యాక్షన్ సీక్వెన్స్ పర్వాలేదు. ఇక కాల భైరవ బిజిఎమ్ అద్భతంగా ఉందన్న ప్రశంసలు అందుకుంటుంది. రితేష్ రానా మార్క్ మీమ్ కామెడీ పర్వాలేదు అనిపిస్తోందని సినీ ప్రేక్షకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక బలహీనమైన స్క్రీన్‌ప్లే, సాగదీసిన సెకండాఫ్ కాస్త మైనస్ గా నిలిచింది. అంతే కాకుండా  కథలో స్పష్టత లోపించింది. క్లైమాక్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడం సినీ ప్రియులను నిరాశ పరిసింది.

మొత్తానికి జెట్లీ’ విమానం సత్య కామెడీ ఇంధనంతో టేకాఫ్ బాగానే తీసుకుంది కానీ, గమ్యానికి చేరేలోపే స్క్రీన్‌ప్లే లోపాల వల్ల గాలిలోనే తడబడింది. సత్య కోసం ఒకసారి చూడొచ్చు కానీ, ‘మత్తు వదలరా’ స్థాయి వినోదాన్ని మాత్రం ఆశించలేం అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.