కేంద్ర ప్రభుత్వం కమర్షియల్ గ్యాస్ ధరలను భారీగా పెంచడంపై తెలంగాణ పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం సామాన్యుడి నడ్డి విరిచేలా ఉందని ఆయన మండిపడ్డారు.19 కేజీల కమర్షియల్ గ్యాస్ ధరను ఏకంగా 993 రూపాయలు అంటే.. సుమారు వెయ్యి రూపాయల వరకు పెంచడాన్ని మంత్రి తీవ్రంగా తప్పుబట్టారు. ఒక్కసారిగా 30 నుండి 35 శాతం ధర పెంచడం ఏంటని ఆయన ప్రశ్నించారు.
ఈ పెంపు వల్ల హోటళ్లు, కేఫ్‌లు, రెస్టారెంట్లతో పాటు రోడ్ల పక్కన వ్యాపారం చేసుకునే చిరు వ్యాపారులపై కోలుకోలేని దెబ్బ పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికలు ముగిసిన 24 గంటల్లోపే కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడాన్ని మంత్రి ఎద్దేవా చేశారు. ఇది ముమ్మాటికీ ప్రజలను మోసం చేయడమేనని ఆయన దుయ్యబట్టారు.
కమర్షియల్ గ్యాస్ ధర పెరగడం అంటే పరోక్షంగా సామాన్యుడి జేబుకు చిల్లు పెట్టడమేనని, దీనివల్ల ప్రజల జీవన ప్రమాణాలు పడిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం పెరిగిన ధరలతో సిలిండర్ రేటు మూడు వేలకు పైగా చేరుకుంది.. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి పెంచిన ధరలను ఉపసంహరించుకోవాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.
వాణిజ్య సిలిండర్ల ధరలను మే 1న కేంద్రం భారీగా పెంచింది. ఒకేసారి.. 19 కేజీల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరపై రూ. 993 పెరిగింది. దీంతో.. ఢిల్లీలో వాణిజ్య సిలిండర్ల ధరలు రూ. 2,078.50 నుంచి రూ. 3,071.50కి పెరగ్గా, ముంబైలో రూ. 2,031 నుంచి రూ. 3,024కి చేరాయి.
కమర్షియల్ సిలిండర్పై ధరను ఒకేసారి దాదాపు వెయ్యి రూపాయల దాకా పెంచడంతో హోటల్స్, హాస్టళ్లపై తీవ్ర ప్రభావం పడింది. ఒక్క హైదరాబాద్‌లోనే నెలకు 6 నుంచి 6.5 లక్షల కమర్షియల్ సిలిండర్లు విక్రయాలు జరుగుతాయి. టీ స్టాల్‌లు నుంచి స్టార్ హోటళ్ల వరకు నెలకు 4 నుంచి 5.50 లక్షల సిలిండర్లకు అవసరం ఉంటుంది. ఇండస్ట్రీలకు మరో 1.50 లక్షలు అదనంగా డిమాండ్ ఉంది. ఈ మొత్తం కమర్షియల్ సేల్స్ విలువ నెలకు రూ.140 నుంచి రూ.150 కోట్లకు చేరుతుందని గ్యాస్ ఏజెన్సీలు అంచనా వేస్తున్నాయి.
