- మొదట్లో లాయర్‌గా ప్రాక్టీస్
- కరోనా తర్వాత ఆర్థికంగా ఛిన్నాభిన్నం
- భార్యకు అనారోగ్యంతో రాజన్న దైవ సన్నిధికి
- ఎవరైనా పెడ్తే తినుడు.. లేదంటే పస్తులు
- ఎములాడలో ఓ జంట కన్నీటి గాథ
వేములవాడ, వెలుగు: భర్త చదివింది ఎల్‌ఎల్‌బీ.. భార్యది బీకాం.. చదువుల సిరి ఉన్నా .. కరోనా తర్వాత పరిస్థితులు దుర్భరంగా మారడం, దీనికితోడు అనారోగ్య సమస్యలతో ఇద్దరూ వేములవాడ రాజన్న సన్నిధి చేరారు. గుడి మెట్లపై ఉంటూ దీనంగా బతుకు వెళ్లదీస్తున్నారు. రాజన్న సిరిసిల్ల కలెక్టర్ గరీమా అగర్వాల్ ఆదేశాల మేరకు జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, అడిషనల్ ఎస్పీ చంద్రయ్య అధ్వర్యంలో రాజన్న ఆలయ పరిసరాల్లో భిక్షాటన చేసే వాళ్లకు ఇటీవల కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన కాసర్ల జలంధర్‌రెడ్డి, ఆయన భార్య రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విలాసాగర్ చెందిన శిరీష విషయం వెలుగులోకి వచ్చింది.
అందరితోపాటు వీరి వివరాలు ఆరా తీసే క్రమంలో అధికారులకు నోట మాట రాలేదు. మంథనికి చెందిన జలంధర్ రెడ్డి డిగ్రీ, ఎల్ఎల్బీ , ఆయన భార్య శిరీష బీకాం కంప్యూటర్స్ చదివినట్లు తెలుసుకొని అవాక్కయ్యారు. వీరిద్దరికి 2006లో పెళ్లి జరిగింది. జలంధర్‌రెడ్డి కరీంనగర్‌లో అడ్వకేట్‌గా ప్రాక్టీస్ చేస్తూ అద్దె ఇంట్లో కాపురం మొదలుపెట్టారు. కరోనా తర్వాత జలంధర్‌రెడ్డి ప్రాక్టీస్దెబ్బతిన్నది. ఆర్థిక సమస్యలకు తోడు శిరీష అనారోగ్యం బారిన పడగా ఎన్ని ఆసుపత్రుల చుట్టు తిరిగినా నయం కాలేదు.
వీరికి పిల్లలు కూడా లేకపోవడంతో జీవితం మీద విరక్తిచెంది, 2 ఏండ్ల క్రితం వేములవాడ వచ్చారు. ఇక్కడే రాజన్న ఆలయ పరిసరాల్లో ఉంటూ కాలం గడుపుతున్నారు. గుడిమెట్లపై ఉంటూ ఎవ్వరినీ చెయ్యిచాచి భిక్షం అడక్కున్నా.. ఎవరైనా ఇస్తే తీసుకుంటామనీ, ఏమీ దొరకనప్పుడు చిన్న చిన్న పనులు చేసుకుంటూ, దేవుడి ప్రసాదంతో కడుపు నింపుకుంటున్నామని చెప్పారు. చిన్నచిన్న కారణాలతోనే విడిపోతున్న జంటలను చూస్తున్న నేటికాలంలో భార్య కోసం అన్నీ వదులుకుని దేవుడి దగ్గరకు చేరిన ఆ భర్త ప్రేమ చూసి అధికారులు సైతం భావోద్వేగానికి లోనయ్యారు.
ఉపాధి చూపితే గుడి మెట్లను వదిలేస్తం
కరోనాతో మా బతుకు దుర్భరంగా మారింది. ప్రాక్టీస్ దెబ్బతిన్నది. నా భార్య అనారోగ్యంతో ఉంటే అనేక ఆసుపత్రులు తిప్పాను. నయం కాలేదు. దీంతో చేసేది లేక మేం రాజన్న సన్నిధికి చేరుకున్నం. మొదట్లో నా భార్యకు రాజన్న కలలోకి వచ్చాడని ఇక్కడికి చేరింది. ఆమెను వెతుక్కుంటూ తర్వాత నేను కూడా వచ్చాను. రోజూ రాజన్న గుడి మెట్లను శుభ్రం చేస్తుంటాం.
చేయిచాచి ఎవర్నీ డబ్బులు అడగం. ఇస్తే తీసుకుంటాం. భిక్షాటన చేసేవాళ్లతోపాటే అధికారులు మమ్మల్ని కూడా అనాథాశ్రమానికి తీసుకెళ్లారు. కానీ అక్కడ ఉండడం ఇష్టం లేక మళ్లీ గుడిమెట్ల దగ్గరిగే వచ్చాం. ప్రభుత్వం ఉపాధి చూపిస్తే రాజన్న గుడి మెట్లను వదిలివెళ్తాం.
కాసర్ల జలంధర్‌రెడ్డి
