
అది ఆగ్రా.. లక్నో ఎక్స్ ప్రెస్ హైవే.. ఈ రూట్ లో టోల్ ఛార్జీ ఎంతో తెలుసా అక్షరాల 665 రూపాయలు. దీపావళి పండుగ రోజు మాత్రం ఈ హైవేపై ప్రయాణించిన వాహనదారులు నిజమైన పండుగ చేసుకున్నారు.. టోల్ గేట్ ఫీజు కట్టకుండా రయ్ రయ్ మంటూ వెళ్లిపోయారు.. టోల్ గేట్ల దగ్గర సిబ్బంది ఉన్నారు.. బారికేడ్లు లేవు.. టోల్ వసూలు చేసే గేట్ ఫ్రీగా ఓపెన్ అయ్యి ఉంది. ఇంకే ముందీ కార్లు అయితే యమా స్పీడ్ వెళ్లిపోయారు. ఇంతకీ దీపావళికి టోల్ గేట్లు ఇంత బంపరాఫర్ ఎందుకు ఇచ్చాయి అంటారా.. దీని వెనక పెద్ద కథనే ఉంది.. ఆ వివరాలు ఇప్పుడు మీ కోసం..
ఆగ్రా.. లక్నో ఎక్స్ ప్రెస్ హైవేపై ఫతేహాబాద్ దగ్గర టోల్ ప్లాజా ఉంది. ఇక్కడ 21 మంది సిబ్బంది పని చేస్తున్నారు. దీపావళి బోనస్ అంటూ కంపెనీ ప్రకటించింది. అది ఎంతో తెలుసా అక్షరాల 11 వందల రూపాయలు. షాక్ అయ్యారు ఉద్యోగులు. 11 వందల రూపాయల బోనస్ ఏంటీ.. అస్సలు ఊహించలేదు. ఆ వెంటనే కుతకుతలాడిపోయారు. టోల్ గేట్ల దగ్గర నిరసన వ్యక్తం చేస్తే ఉపయోగం ఏంటీ.. 11 వందల బోనస్ ఇచ్చిన కంపెనీకి తిక్కకుదరాలి అని భావించి.. ఏకంగా టోల్ గేట్లను ఎత్తివేశారు. మొత్తం సిబ్బంది బారికేడ్లను కూడా తొలగించి.. రోడ్డు పక్కన ధర్నాకు దిగారు. ఆ టోల్ గేట్ దగ్గర క్యాష్ పేమెంట్ కూడా ఉంది.. ఆ రూట్ ను కూడా ఫ్రీగా వదిలేశారు ఉద్యోగులు.
విషయం తెలుసుకుని షాక్ అయ్యింది యజమాన్యం. చర్చలకు పిలిచారు కంపెనీ ఉద్యోగులు. బోనస్ పెంచుతామని.. వెంటనే విధుల్లో చేరాలని కోరారు. నాలుగు గంటల చర్చల తర్వాత ఉద్యోగులు మళ్లీ విధుల్లో జాయిన్ అయ్యారు. ఈ నాలుగు గంటల సమయం టోల్ గేట్ల దగ్గర ఫ్రీగా వెళ్లిపోయాయి వాహనాలు.
ఫాస్ట్ ట్యాగ్ స్కాన్ అవుతుంది కదా..:
వాహనాలకు ఉండే ఫ్యాస్ట్ ట్యాగ్ ఆటోమేటిక్ గా స్కాన్ అవుతుంది కదా.. ఫ్రీగా ఎలా వెళ్లాయి అనే అనుమానం రావొచ్చు. ఇదే విషయంపై కంపెనీ అధికారులను ప్రశ్నిస్తే.. టోల్ గేట్ నుంచి వేగంగా వెళ్లిపోతే స్కాన్ కాదని.. నిదానంగా వెళితేనే స్కాన్ అవుతుందని.. వేగంగా వెళ్లినప్పుడు స్కాన్ కావటం కష్టం అని స్పష్టం చేశారు అధికారులు. ఈ నాలుగు గంటల్లోనే వేలాది వాహనాలకు స్కాన్ కాలేదని.. అదే విధంగా క్యాష్ పేమెంట్స్ జరగలేదని వివరించారు.
డిమాండ్ చేసిన బోనస్ కంటే ఎక్కువ నష్టం :
టోల్ ప్లాజా దగ్గర పని చేస్తున్నది 21 మంది ఉద్యోగులు. గత ఏడాది దీపావళి బోనస్ 5 వేల రూపాయలు వేశారు. ఈసారి కూడా 5 వేల రూపాయలు లేదా అంత కంటే ఎక్కువ బోనస్ వేస్తారని భావించారు ఉద్యోగులు. వాళ్ల అంచనాకు భిన్నంగా.. ఊహించని విధంగా 11 వందల రూపాయలు మాత్రమే ఇవ్వటంతో రగిలిపోయారు.
టోల్ గేట్లు 4 గంటలు ఫ్రీగా వదిలేయటం వల్ల.. ఉద్యోగులు డిమాండ్ చేసిన బోనస్ కంటే.. చాలా ఎక్కువ నష్టం వచ్చిందిన కంపెనీ అధికారులు వెల్లడించారు. దీనిపై సోషల్ మీడియా సెటైర్లు పడుతున్నాయి. కంపెనీ యజమాన్యానికి తిక్క కుదిరింది.. వాళ్లు అడిగిన బోనస్ ఇచ్చి ఉంటే.. ఇంత నష్టం వచ్చేది కాదు కదా అంటూ చురకలు అంటిస్తు్న్నారు.