పత్తి విత్తనాలు వేసేందుకు మెషిన్లు

పత్తి విత్తనాలు వేసేందుకు మెషిన్లు

హైదరాబాద్‌, వెలుగు: రాష్ట్రంలో పత్తి విత్తనాలు వేసేందుకు మిషిన్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ సీజన్ లో 40 వేల ఎకరాల్లో హైడెన్సిటీ విధానంలో పత్తి సాగు చేయించాలని నిర్ణయించిన వ్యవసాయ శాఖ.. అందుకు అనుగుణంగా 10 పత్తి విత్తనాలు వేసే మిషిన్లను తెప్పించింది. వీటిని వ్యవసాయ యూనివర్సిటీ పరిధిలోని పరిశోధన కేంద్రాలకు అందజేసింది. ఈ సీజన్‌లో మిషిన్ల పనితీరును పరిశీలించి, వచ్చే సీజన్ లో మరిన్ని తెప్పించాలని భావిస్తోంది. పత్తి తీసే మిషిన్లను కూడా తీసుకురావాలని యోచిస్తోంది. ఇప్పటికే తమిళనాడులో పత్తి తీసే మిషిన్లు అందుబాటులో ఉండగా, వాటిని తెప్పించి పరిశీలించాలని చూస్తోంది.  

45 నిమిషాల్లోనే ఎకరం.. 
ఈ మిషిన్లతో కేవలం 45 నిమిషాల్లోనే ఎకరంలో పత్తి విత్తనాలు వేయొచ్చు. కూలీల ద్వారా విత్తనాలు వేస్తే ఎకరానికి రూ.3,500 నుంచి  రూ.4 వేల వరకు ఖర్చవుతుంది. కానీ ఈ మిషిన్ల ద్వారా ఎకరానికి రూ.1500 మాత్రమే ఖర్చవుతుంది. అంటే మిషిన్లు వాడితేనే రైతులకు తక్కువ ఖర్చవుతుంది. మరోవైపు కూలీలు కొరత కూడా ఉండడంతో మిషిన్ల వినియోగాన్ని ప్రోత్సహించాలని వ్యవసాయ శాఖ భావిస్తోంది. పత్తి ఏరే మిషిన్లను కూడా తెప్పిస్తే రైతులకు భారీగా ఖర్చు తగ్గుతుందని యోచిస్తోంది.