3.81 లక్షల ఎకరాల్లో పంటనష్టం.. వ్యవసాయశాఖ నివేదిక

3.81 లక్షల ఎకరాల్లో పంటనష్టం.. వ్యవసాయశాఖ నివేదిక
  • మొదటి విడతలో 1.51 లక్షల ఎకరాల్లో పంటనష్టం అంచనా  
  • రెండో విడతలో రూ. 230 కోట్ల పరిహారం
  • ఇప్పటికీ విడుదల కాని నిధులు  

హైదరాబాద్‌‌, వెలుగు: ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా చెడగొట్టు వానలు, వడగండ్ల వర్షాలకు మొత్తం 3.81 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని వ్యవసాయశాఖ గుర్తించింది. మార్చి నెలలో కురిసిన వర్షాలకు1.51 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ఇదివరకే మొదటి విడతలో గుర్తించిన సర్కారు రూ. 151.60 కోట్ల నష్ట పరిహారం ప్రకటించింది. కానీ ఇప్పటివరకూ రైతులకు పరిహారం పైసలు అందలేదు. తాజాగా రెండో విడతలో ఏప్రిల్ ప్రారంభం నుంచి మే 12 వరకు కురిసిన అకాల వర్షాలకు 2.30 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని వ్యవసాయశాఖ ప్రభుత్వానికి తుది నివేదికను అందజేసింది. రెండో విడతలో పంట నష్టానికి గాను రూ. 230 కోట్లను పరిహారంగా చెల్లించాలని పేర్కొంది. అయితే, ఒక్కో రైతుకు ఏదో ఒక విడతలో నష్టానికి మాత్రమే పరిహారం అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, పరిహారం పంపిణీ కోసం త్వరలోనే నిధులు విడుదల చేయనుందని వ్యవసాయశాఖ వర్గాలు చెప్తున్నాయి.  

జీవో వచ్చినా.. పైసలు పడలే    

ఈ ఏడాది మార్చి, ఏప్రిల్‌‌ నెలల్లో రెండుసార్లు వడగండ్ల వానలు, భారీ వర్షాలు పడ్డాయి. ఈ యాసంగి సీజన్‌‌లో వాస్తవానికి15 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అగ్రికల్చర్ ఎక్స్ పర్ట్ లు చెప్తున్నారు. వరి, మొక్కజొన్న, జొన్న,  మామిడి, కూరగాయలు, పండ్లతోటలు ఇలా వివిధ పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని అంటున్నారు. అయితే, పంటపొలాల్లో 33 శాతం పంట దెబ్బతింటేనే దానిని పంట నష్టంగా రాష్ట్ర సర్కారు గుర్తించింది. ఈ నేపథ్యంలో పరిహారం నష్టం జరిగిన పంటల్లో పావువంతు పంటలకే ప్రకటించారు. పంట నష్టం జరిగిన జిల్లాల్లో సీఎం కేసీఆర్‌‌ పర్యటించి, పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 10 వేల చొప్పున పరిహారం కూడా ప్రకటించారు. ఈ మేరకు రూ. 151 కోట్ల పరిహారం చెల్లిస్తామని సర్కారు మార్చి నెలలోనే జీవో విడుదల చేసింది. కానీ ఇప్పటివరకు రైతులకు పరిహారం అందలేదు.    

ఒక్క విడతకే నష్ట పరిహారం  

రెండు విడతల్లో పంటను నష్టపోయిన రైతులకు ఒక్క విడత నష్టానికి మాత్రమే పరిహారం ఇవ్వాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది.