రియల్ దందా.. పచ్చని పొలాలు మాయం

రియల్ దందా.. పచ్చని పొలాలు మాయం
  • పచ్చని పొలాలు ప్లాట్లుగా మారుతున్నయ్​
  • అనుమతులు లేకుండానే వెంచర్లు
  • పట్టించుకోని ఆఫీసర్లు

భద్రాచలం, వెలుగు: భద్రాచలం పట్టణంలో పచ్చని పొలాలు ప్లాట్లుగా మారుతున్నాయి. ఎక్కడ చూసినా కొత్త వెంచర్లు వెలుస్తున్నాయి. పోలవరం నిర్వాసితులు పట్టణంలో ఇండ్ల స్థలాల కోసం అన్వేషిస్తుండడంతో భూముల రేట్లకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. అసలు అనుమతుల్లేకుండానే వెంచర్లు వేస్తుండగా ఆఫీసర్లు కనీసం అటువైపు కూడా చూడడం లేదు. భద్రాచలం పట్టణంలోని శాంతినగర్​ కాలనీలో ఓ మాజీ ప్రజాప్రతినిధి మూడున్నర ఎకరాల వ్యవసాయ భూమిని చదును చేసి వెంచర్లు వేస్తున్నారు. సెంటు భూమిని రూ.1.10 లక్షలకు ధర నిర్ణయించి అమ్ముతున్నారు. 
నిబంధనలు ఇలా..
పంటలు పండే భూముల్లో ప్లాట్లు చేయడానికి వ్యవసాయేతర భూమిగా మార్చుకోవాలి. తహసీల్దార్​  ఆఫీసులో అప్లై చేయాలి. భూమి రిజిస్ట్రేషన్​ విలువలో పది శాతం నాలా రుసుం కింద చెల్లించాలి. ఆ తర్వాత తహసీల్దార్​ ఆఫీసు నుంచి సబ్​ కలెక్టర్ ఆఫీసుకు ఫైల్​ పంపుతారు. సబ్​ కలెక్టర్​ కార్యాలయం ఆఫీసర్లు ఫీల్డ్  లెవల్‍లో పరిశీలన చేసి వ్యవసాయేతర భూమిగా మార్పు చేస్తూ సర్టిఫికెట్​ ఇస్తారు. సంబంధిత భూయజమాని వెంచర్​ కోసం 40 ఫీట్లతో ప్రధాన దారి, 33 ఫీట్లతో ఇంటర్నల్​ రోడ్లు, మురికి కాల్వలు, విద్యుత్​ లైన్లు, డ్రింకింగ్​ వాటర్​ వసతి కల్పించాలి. పార్కు, డంపింగ్​ యార్డు, అంగన్‍వాడీ కేంద్రాలకు పంచాయతీ పేరిట 10 శాతం భూమిని రిజిస్ట్రేషన్​ చేయించాలి. పంచాయతీ నుంచి పర్మిషన్​ తీసుకోవాలి. అప్పుడే ప్లాట్ల పనులు చేపట్టాలి. 
మన్యంలో ఎలా వేస్తారు?
భద్రాచలం మన్యంలో ఏ భూమి కూడా అమ్మకూడదు.. కొనకూడదు. ఇది 5వ షెడ్యూల్​ ఏరియా. గిరిజన చట్టాలు ఉన్నాయి. ఎల్టీఆర్​ చట్టం ప్రకారం కేవలం గిరిజనుల మధ్యే క్రయ,విక్రయాలు జరగాలి. అసలు ఇతరులెవ్వరికీ రిజిస్ట్రేషన్లు చేయరు. అంటే ప్రస్తుతం శాంతినగర్ కాలనీలో పచ్చని పొలాన్ని వెంచర్‍గా మార్చిన భూమికి ఎటువంటి అనుమతుల్లేవన్న మాట. కళ్ల ముందే ఇంత జరుగుతున్నా ఆఫీసర్లు నిద్రపోతున్నారు. దీనికి తోడు ఈ వెంచర్​ చుట్టూ మరో వివాదం ముసురుకుంది. వెంచర్‍కు వెళ్లడానికి రోడ్డు లేదు. పక్కనే ఉన్న కుసుమ హరనాథస్వామి ఆలయానికి చెందిన అర ఎకరం భూమిలో అక్రమంగా రోడ్డు వేశారు. దీంతో దేవస్థానం ఈవో ఆ రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకున్నారు. అయినా కూడా అనుమతుల్లేకుండానే వెంచర్‍ను ముందుకు కొనసాగిస్తున్నారు. రెవెన్యూ, పంచాయతీ ఆఫీసర్లు ఈ అక్రమ వెంచర్‍ను అడ్డుకోవాలని గిరిజన సంఘాలు కోరుతున్నాయి.