- ఈ నెల 17 నుంచి పత్తి కొనుగోళ్లు నిలిపివేస్తామని జిన్నింగ్ మిల్లుల అల్టిమేటంతో వ్యవసాయ శాఖ అలర్ట్
- రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని కొనుగోళ్లు ఆపొద్దని మిల్లులకు మంత్రి విజ్ఞప్తి
హైదరాబాద్, వెలుగు: సీసీఐ ప్రవేశపెట్టిన కొత్త నిబంధనలు తమకు నష్టాన్ని కలిగిస్తాయంటూ జిన్నింగ్ మిల్లుల ప్రతినిధులు ఈ నెల 17 నుంచి పత్తి కొనుగోళ్లను నిలిపివేస్తామని ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ అప్రమత్తమైంది. జిన్నింగ్ మిల్లుల సమస్యలను అర్థం చేసుకొని పరిష్కారం దిశగా వెంటనే చర్చలు జరపాలని వ్యవసాయ శాఖ సెక్రటరీని ఆ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. సీసీఐ తీసుకొచ్చిన ఎల్1, ఎల్2 నిబంధనలతో మిల్లులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, తేమశాతం, ఎకరానికి 7 క్వింటాళ్ల పరిమితి కారణంగా రైతులకు కలుగుతున్న భారాన్ని సీసీఐ ఎండీ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం ఒత్తిడి తీసుకురావాలని మంత్రి సూచించారు. మిల్లులు పత్తి కొనుగోళ్లు కొనసాగించాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు.
కేంద్ర జౌళి శాఖ మంత్రికి, సీసీఐ ఎండీకి ఇప్పటికే లేఖలు రాసినా స్పందన రాకపోవడంతో, సమస్య పరిష్కారం కోసం రాష్ట్ర అధికారులు ఢిల్లీ వెళ్లి కేంద్ర స్థాయిలో ఒత్తిడి తీసుకురావాలని సెక్రటరీకి మంత్రి ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర జౌళి శాఖ సూచనల మేరకు పత్తి కొనుగోలు పరిమితి పెంపుపై నిర్ణయానికి అవసరమైన జిల్లావారీ సరాసరి దిగుబడి గణాంకాలను అత్యవసరంగా సేకరించాలన్నారు. రాష్ట్రంలోని అనేక జిల్లాలలో పత్తి దిగుబడి ఎకరానికి 11 క్వింటాళ్ల వరకు ఉన్నందున, పరిమితిని 7 నుంచి 11 క్వింటాళ్లకు పెంచాలని కేంద్రాన్ని రాష్ట్రం కోరింది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు వాస్తవిక పత్తి దిగుబడి గణాంకాలను అత్యవసరంగా సేకరించి పంపేలా చర్యలు తీసుకోవాలని సెక్రటరీకి మంత్రి తుమ్మల స్పష్టం చేశారు.
