నన్ను మాట్లాడనిస్తలే.. లోక్‌‌సభ ఏదో ఒక రాజకీయ పార్టీది కాదు: రాహుల్

నన్ను మాట్లాడనిస్తలే.. లోక్‌‌సభ ఏదో ఒక రాజకీయ పార్టీది కాదు: రాహుల్
  • ప్రధాని మోదీ కొన్ని శక్తులతో రాజీపడ్డారని ఆరోపణ


న్యూఢిల్లీ: సభలో తన గొంతు నొక్కేస్తున్నారని, తనను మాట్లాడనీయకుండా పదేపదే అడ్డుకుంటున్నారని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఫైర్‌‌‌‌ అయ్యారు.  కేంద్ర ప్రభుత్వంపై, ప్రధాని నరేంద్ర మోదీపై సంచలన ఆరోపణలు చేశారు. ‘‘లోక్‌‌సభ అనేది ఏదో ఒక రాజకీయ పార్టీకి చెందింది కాదు.. అది యావత్ దేశానికి ప్రాతినిథ్యం వహిస్తుంది.  కానీ, ఈ సభలో చర్చ జరుగుతున్నప్పుడు నా పేరును పదేపదే ప్రస్తావిస్తూ, నాపై నీచమైన విమర్శలు చేస్తున్నారు. ప్రజాస్వామ్య ప్రక్రియ, స్పీకర్ పాత్ర గురించి ఇక్కడ చర్చ జరగాలి.. కానీ నన్ను వ్యక్తిగతంగా లక్ష్యం చేసుకుంటున్నారు” అని వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోదీ కొన్ని శక్తులతో రాజీపడ్డారని,  దాని ఫలితం ఏమిటో దేశం మొత్తానికి తెలుసని అన్నారు.  ‘‘మేం మాట్లాడటానికి లేచిన ప్రతిసారీ మమ్మల్ని ఆపేస్తున్నారు. గతంలో నేను ప్రసంగించినప్పుడు ప్రధాని తీసుకున్న కొన్ని వివాదాస్పద నిర్ణయాల గురించి ప్రాథమిక ప్రశ్నలు అడిగా. కేవలం కొన్ని రోజుల క్రితమే, దేశ చరిత్రలోనే ముందెన్నడూ లేని విధంగా ఒక ప్రతిపక్ష నేతను చర్చలో పాల్గొనకుండా అడ్డుకున్నారు” అని ఫైర్‌‌‌‌ అయ్యారు. ఆర్మీ మాజీ చీఫ్ ఎం.ఎం. నరవణే బుక్‌‌ వ్యవహారం, ఎప్‌‌స్టీన్‌‌ ఫైల్స్​అంశం, అదానీలాంటి కీలక విషయాలను సభలో లేవనెత్తినందుకే తనను మౌనంగా ఉంచే ప్రయత్నం చేస్తున్నారని, ఇవన్నీ దేశ ప్రజలకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన అంశాలని రాహుల్‌‌గాంధీ అన్నారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్‌‌పై మండిపడ్డారు. అదే సమయంలో ప్రభుత్వం తనను మాట్లాడకుండా గొంతు నొక్కుతున్నదని రాహుల్​గాంధీ ఫైర్‌‌‌‌ అయ్యారు.

అమిత్ షా క్షమాపణలు చెప్పాలంటూ ప్రతిపక్షాల పట్టు..

అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా అమిత్ షా చేసిన కొన్ని వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఆయన క్షమాపణ చెప్పాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్‌‌ చేశారు. పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ క్రమంలో సభకు అధ్యక్షత వహిస్తున్న జగదాంబికా పాల్ సభ్యులను శాంతింపజేసేందుకు ప్రయత్నించారు. తీర్మానంపై ఓటింగ్ నిర్వహించేందుకు వీలుగా ప్రతిపక్షాలు తమ సీట్లలో కూర్చోవాలని ఆయన పదేపదే విజ్ఞప్తి చేశారు. అయితే, గందరగోళం కొనసాగడంతో ఆయన నేరుగా ఓటింగ్‌‌కు వెళ్లారు. మెజారిటీ సభ్యులు స్పీకర్‌‌‌‌పై అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేయడంతో అది వీగిపోయిందని ప్రకటిస్తూ సభను గురువారానికి వాయిదా వేశారు.