- సోషల్ మీడియాలో దుష్ప్రచారం నేపథ్యంలో సీఎం నిర్ణయం
- రేపు తాజ్ కృష్ణలో కార్యక్రమం
- మూసీ రివర్ ఫ్రంట్ ఆవశ్యకత, కార్యాచరణ ప్రణాళికపై పీపీటీ
హైదరాబాద్, వెలుగు: మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టుపై కొద్ది రోజులుగా సోషల్ మీడియా వేదికగా కొందరు పనిగట్టుకుని చేస్తున్న తప్పుడు ప్రచారానికి చెక్‌పెట్టాలని సర్కారు భావిస్తున్నది. మూసీ ప్రాజెక్టుపై ప్రజలకు వాస్తవలు వివరించాలని సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే ఈ నెల 13న హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణా హోటల్‌లో ‘మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్’ ఆధ్వర్యంలో ‘మూసీ ఇన్వైట్స్’ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ వేదిక మీదుగా మూసీ నది పునరుజ్జీవనం, రివర్‌ఫ్రంట్ ఆవశ్యకత, కార్యాచరణ ప్రణాళికలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (పీపీటీ) ద్వారా వివరించనున్నారు. వివిధ రాజకీయ పార్టీల ముఖ్య నాయకులు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలను ఈ సదస్సుకు ఆహ్వానించారు. రాజకీయ నేతలతోపాటు దేశంలో గుర్తింపు పొందిన మేధావులు, పర్యావరణ నిపుణులు, అర్బన్ ప్లానర్లు, ఆర్కిటెక్ట్‌లు సైతం ఇందులో పాలుపంచుకోనున్నారు. అలాగే, వాణిజ్య సంస్థలైన క్రెడాయ్, సీఐఐ, ఎఫ్ఐసీసీఐ ప్రతినిధులతోపాటు విదేశీ దౌత్యవేత్తలను ప్రత్యేకంగా ఇన్వైట్ చేశారు. ప్రాజెక్టు ప్రతిపాదిత ప్రణాళికలను అందరి ముందుంచనున్నారు.
మూసీ పునరుజ్జీవనం అంటే పర్యావరణ పరిరక్షణ..
2024 నుంచే మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇండ్లు కూలగొడుతున్నారంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారానికి ఈ ప్రజెంటేషన్ ద్వారా ప్రభుత్వం బదులివ్వాలనుకుంటున్నది. ఒకప్పటి మూసీ పరిస్థితి, నేటి కలుషిత దుస్థితితోపాటు నగరానికి భవిష్యత్తులో పొంచి ఉన్న పర్యావరణ ముప్పును ఈ సమావేశంలో విశ్లేషించనున్నారు. మూసీ పునరుజ్జీవనం అంటే కేవలం కాంక్రీట్ నిర్మాణాలు కాదని.. స్వచ్ఛమైన నీటి సరఫరా, పర్యావరణ పరిరక్షణే లక్ష్యమనే వాస్తవాన్ని ఆధారాలతో చూపనున్నారు. నదీ తీరాల అభివృద్ధిని పర్యావరణహితంగా ఎలా చేపట్టబోతున్నారు? ప్రజోపయోగ మౌలిక వసతులను ఎలా ఏర్పాటు చేస్తారు? అనే విషయాలను నిపుణులు వివరిస్తారు. ఆక్రమణల తొలగింపు వెనుక ఉన్న అసలు కారణాలను, ముంపు ముప్పు నుంచి హైదరాబాద్‌ను రక్షించే బృహత్తర ప్రణాళికలను తెలియజేస్తారు. ఈ ప్రాజెక్టు అమలులో భాగంగా తొలి దశలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ‘గాంధీ సరోవర్ ప్రాజెక్టు’ను చేపట్టాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఈ తొలిదశ నిర్మాణ నమూనాలను, అందులో అంతర్జాతీయ ప్రమాణాలను ఎలా పాటిస్తున్నారో ఆర్కిటెక్టులు, ప్లానర్లు వివరిస్తారు. ఆరోపణలు పక్కనపెట్టి, సాంకేతిక వాస్తవిక కోణంలో ప్రాజెక్టు ప్రయోజనాలను అర్థం చేసుకునేలా ఈ ప్రజెంటేషన్ డిజైన్ చేశారు. తద్వారా మూసీ ప్రక్షాళన అనేది నగర మనుగడకు ఎంత అవసరమో వివిధ వర్గాల ప్రముఖులకు, సాధారణ ప్రజానీకానికి వివరించనున్నారు. ఈ ప్రతిష్టాత్మక ‘మూసీ ఇన్వైట్స్’ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పాల్గొని ప్రభుత్వ పారదర్శక విధానాన్ని ప్రకటిస్తారు. మూసీ నది పునరుద్ధరణపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని, భవిష్యత్తు ప్రణాళికలను వెల్లడించనున్నారు. మేధావులు, వ్యాపారవేత్తల సూచనలు, సలహాలు తీసుకొని ప్రాజెక్టును మరింత పకడ్బందీగా ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న సంకేతాలు ఈ కార్యక్రమంలో ఇవ్వనున్నారు. అన్ని పార్టీల నేతలను ఒకే వేదికపైకి తేవడం ద్వారా, మూసీ అభివృద్ధి అనేది ఏ ఒక్క పార్టీకో సంబంధించినది కాదని, అది నగర ప్రయోజనమనే భావనను నెలకొల్పనున్నారు.
