శాయంపేట, వెలుగు: చిట్ ఫండ్ వ్యాపారం పేరుతో ప్రజలను మోసం చేసి సుమారు రూ.5.04 కోట్లు దోచుకున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. పరకాల ఏసీపీ సతీష్ బాబు బుధవారం వివరాలు వెల్లడించారు. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పత్తిపాక గ్రామానికి చెందిన పెరుమాండ్ల కిషోర్(40) 2011 నుంచి చిట్ ఫండ్ వ్యాపారం నిర్వహిస్తూ సభ్యుల నుంచి కోట్లలో డబ్బులు వసూలు చేసి మోసం చేశాడు. మొదటి కేసులో 117 మంది సభ్యుల నుంచి చిట్స్ పేరుతో రూ.1,49,22,000 వసూలు చేసినట్లు శాయంపేట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
మరో కేసులో 59 మంది సభ్యుల నుంచి డెబిట్ పద్ధతిలో రూ.3,55,67,500 వసూలు చేసి తిరిగి చెల్లించకుండా మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. రెండు కేసుల్లో కలిపి మొత్తం 176 మంది సభ్యుల నుంచి రూ.5,04,89,500 మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు.
వసూలు చేసిన డబ్బుతో ఆస్తులు కొనుగోలు..
అక్రమంగా వసూలు చేసిన డబ్బులతో కిశోర్ వివిధ జిల్లాలో భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. వివిధ జిల్లాల్లో వ్యవసాయ భూములు, ప్లాట్లు, ఇండ్లతో పాటు వాహనాలు, బంగారు ఆభరణాలు కొనుగోలు చేశాడు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు భూములకు సంబంధించిన పత్రాలు, రూ.27 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రూ.25 లక్షలు, కారు స్వాధీనం చేసుకున్నారు.
