న్యూఢిల్లీ, వెలుగు: ఫిరాయింపు ఎమ్మెల్యేలపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఇచ్చిన తీర్పుపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మండిపడ్డారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఫిరాయింపుల కిందకు రారని స్పీకర్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇది సభ్యసమాజం తలదించుకునేలా ఉందని విమర్శించారు. బుధవారం ఢిల్లీలోని తన నివాసంలో మీడియాతో ఆయన మాట్లాడారు. ఫిరాయింపుల విషయంలో స్పీకర్ ఇచ్చిన తీర్పు ప్రజాస్వామ్య చరిత్రలో ‘చీకటి రోజు’ అని, ఇది వ్యవస్థకే గొడ్డలి పెట్టు వంటిదన్నారు.
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎమ్మెల్యేలను ‘హోల్ సేల్’గా చేర్చుకుంటే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ‘రిటైల్’ గా చేర్చుకుంటున్నదని ఎద్దేవా చేశారు. స్పీకర్ వ్యవస్థకు మచ్చ తెచ్చేలా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు.‘‘ఒక ఎమ్మెల్యే ఎంపీగా పోటీ చేసినా, మరొకరు పార్టీ ప్రచారంలో పాల్గొన్నా.. ఆధారాలు లేవంటూ క్లీన్ చిట్ ఇవ్వడం ఏంటి’’ అని ప్రశ్నించారు.
