పంట మార్పిడి, యాంత్రీకరణకు ప్రభుత్వం ప్రాధాన్యం : అగ్రికల్చర్ సెక్రటరీ సురేంద్ర మోహన్

పంట మార్పిడి, యాంత్రీకరణకు ప్రభుత్వం ప్రాధాన్యం : అగ్రికల్చర్ సెక్రటరీ సురేంద్ర మోహన్
  • ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులు తయారు చేయడంలో మహిళల పాత్ర కీలకం : అగ్రికల్చర్ వీసీ జానయ్య

హైదరాబాద్, వెలుగు: ప్రకృతి వ్యవసాయ విధానాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని, పంట మార్పిడి, యాంత్రీకరణకు ప్రాధాన్యత కల్పిస్తుందని అగ్రికల్చర్ సెక్రటరీ సురేంద్ర మోహన్ అన్నారు. అగ్రికల్చర్​వర్సిటీ, రాష్ట్ర వ్యవసాయశాఖ, కోరమాండల్ సంస్థ సంయుక్తంగా రెండ్రోజులు నిర్వహించిన మెగా మహిళా రైతు మేళా సోమవారం ముగిసింది. ఈ కార్యక్రమానికి అగ్రికల్చర్ సెక్రటరీ హాజరై మాట్లాడుతూ, రైతు సంక్షేమానికి ప్రభుత్వం విశేషంగా  కృషి చేస్తోందన్నారు.

వరి ఉత్పత్తిలో రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందని తెలిపారు. కూరగాయలు, పూలు, ఆయిల్ పామ్ వంటి పంటల సాగు పెంచాలని సూచించారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా మే 4 నుంచి 9 వరకు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపై 12 అంశాల్లో రైతులకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. అగ్రికల్చర్ వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య మాట్లాడుతూ, నేల ఆరోగ్యం, ఆధునిక వ్యవసాయంలో మహిళల పాత్రపై అవగాహన కల్పించామని తెలిపారు.

కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే సీఎం లక్ష్య సాధనలో మహిళా రైతుల పాత్ర ఎంతో కీలకమన్నారు. పంట సాగులో అధిక రసాయనాలు వాడడంతో నేల, గాలి, నీటి నాణ్యత క్షీణిస్తుందని చెప్పారుఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులను తయారు చేయడంలో మహిళల పాత్ర కీలకమన్నారు. రసాయనాల వాడకం తగ్గించి సేంద్రియ ఎరువులతో పంటలు సాగు చేయాలని రైతులకు పిలుపునిచ్చారు.