వ్యవసాయ రంగాన్ని నాశనం చేశారు: రాహుల్ గాంధీ

వ్యవసాయ రంగాన్ని నాశనం చేశారు: రాహుల్ గాంధీ

సామాన్య రైతుకు ఉన్న జ్ఞానం వ్యవసాయ మంత్రికి లేదు
మోడీ, కేసీఆర్​ల ప్రజా వ్యతిరేక పాలన చూడలేకే పాదయాత్ర చేస్తున్న
ఆందోల్ నియోజకవర్గంలో కొనసాగిన భారత్ జోడో యాత్ర

సంగారెడ్డి, వెలుగు: కేసీఆర్ పాలనలో రైతులు దివాలా తీశారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. వ్యవసాయ రంగాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందని, రైతులను అడుక్కునే పరిస్థితికి తెచ్చిందని మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతులు గొప్పగా బతికారని, టీఆర్ఎస్ పాలనలో దీనస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారని అన్నారు. రాహుల్ చేపట్టిన భారత్ జోడో పాదయాత్ర శనివారం సంగారెడ్డి జిల్లాలోని ఆందోల్ నియోజకవర్గంలో కొనసాగింది. సాయంత్రం అల్లాదుర్గం మండలం గడి పెద్దాపూర్ కార్నర్ మీటింగ్‌‌‌‌లో రాహుల్ మాట్లాడారు. ‘‘మోడీ పాలనలో డీజిల్, పెట్రోల్, నిత్యావసర ధరలు పెరిగాయి. కాంగ్రెస్ హయాంలో గ్యాస్ ధర రూ.400 ఉంటే అప్పుడు మోడీ లొల్లి చేసిండు. ఇప్పుడు అదే గ్యాస్ సిలిండర్ ధర రూ.1,100 చేశాడు. పెట్రోల్, డీజిల్ రూ.50 ఉంటే ఇప్పుడు రూ.110 చేసి ప్రజలపై తీవ్ర భారం మోపిండు. కేంద్రంలో నరేంద్ర మోడీ, తెలంగాణలో కేసీఆర్ పాలన ఒకేలా సాగుతున్నాయి” అని ఆరోపించారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దినదినం గండంలా మారిందన్నారు. ఒక సామాన్య రైతుకు ఉన్న కనీస జ్ఞానం వ్యవసాయ శాఖ మంత్రికి లేదని విమర్శించారు. రాష్ట్రంలో వ్యవసాయాన్ని నమ్ముకుని బతుకుతున్న రైతుల పరిస్థితి అధ్వానంగా ఉందన్నారు. మోడీ, కేసీఆర్‌‌‌‌‌‌‌‌ల ప్రజా వ్యతిరేక పాలనను చూడలేకనే భారత్ జోడో యాత్ర చేపట్టినట్టు తెలిపారు. పాదయాత్రలో రాహుల్ వెంట పీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి, ఎంపీ ఉత్తమ్​కుమార్​రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, నేతలు భట్టి విక్రమార్క, జగ్గారెడ్డి, షబ్బీర్ అలీ, మదన్ మోహన్, దామోదర రాజనర్సింహ, సంపత్​కుమార్ తదితరులు ఉన్నారు.

సబ్సిడీలు ఎత్తేసిన్రు: రైతు నాగిరెడ్డి

పాదయాత్రలో రాహుల్‌‌‌‌తో కొందరు రైతులు తమ సమస్యలు చెప్పుకున్నారు. నాగిరెడ్డి అనే రైతుతో సభా వేదికపై మాట్లాడారు. వ్యవసాయ పనిముట్ల సబ్సిడీలు ఇవ్వడం లేదని, విత్తన, ఎరువులు ఇతరత్రా వ్యవసాయ రంగానికి సంబంధించిన ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని చెప్పారు. కాంగ్రెస్ పరిచయం చేసిన సబ్సిడీలు ఇప్పుడు ఇవ్వడం లేదన్నారు. పెస్టిసైడ్స్ మీద జీఎస్టీ భారం మోపుతున్నారన్నారు. కాంగ్రెస్ హయాంలో అనేక ప్రాజెక్టులు నిర్మించగా.. ప్రస్తుతం ఏ ఒక్క ప్రాజెక్టు ముందుకు నడవడం లేదన్నారు. రైతులకు న్యాయం జరగాలంటే కేంద్ర, రాష్ట్రాల్లో కాంగ్రెస్ పాలన కొనసాగాలని నాగిరెడ్డి చెప్పారు. దీంతో రాహుల్ ‘శభాష్’ అని మెచ్చుకున్నారు. ఒక రైతుగా భవిష్యత్తు ఎలా ఉంటుందని నాగిరెడ్డిని రాహుల్ గాంధీ అడిగారు. ‘‘కాంగ్రెస్ ప్రభుత్వం రైతును రాజు చేయాలని చూసింది.. ఈ ప్రభుత్వాలు రైతుని గరీబు చేశాయి’’ అని నాగిరెడ్డి అన్నారు.

కానిస్టేబుల్‌‌‌‌కు గాయాలు

జోగిపేట మున్సిపాలిటీలో పాదయాత్ర కొనసాగుతుండగా కానిస్టేబుల్ గాయపడ్డాడు. మెదక్ జిల్లా పాపన్న పేట పోలీస్ స్టేషన్‌‌‌‌కు చెందిన కానిస్టేబుల్ శివకుమార్.. హౌసింగ్ బోర్డ్ వద్ద కాన్వాయ్‌‌‌‌కి, డివైడర్‌‌‌‌‌‌‌‌కు మధ్యలో నిలబడి ప్రజలను కంట్రోల్ చేస్తుండగా ప్రమాదం జరిగింది. శివకుమార్ వైపు కాన్వాయ్ వెహికల్ రావడంతో కాలు ఇరుక్కుని తీవ్ర గాయమైంది. సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా కాలు విరిగినట్టు డాక్టర్లు చెప్పారు. 

మోడీ మరో తానీషా.. కేసీఆర్ మరో నిజాం: జైరామ్ రమేశ్

దేశంలో ప్రధాని మోడీ, తెలంగాణలో సీఎం కేసీఆర్ పాలనలో అన్ని వ్యవస్థలూ నాశనం అయ్యాయని కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేశ్ ఫైర్ అయ్యారు. మోడీ మరో తానీషా లాగా, కేసీఆర్ మరో నిజాం లాగా పాలన సాగిస్తున్నారని విమర్శించారు. శనివారం సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గం దనంపల్లి శివారులో భారత్ జోడో యాత్ర సందర్భంగా మీడియాతో జైరామ్ రమేశ్ మాట్లాడారు. దేశంలో అన్ని వర్గాల ప్రజలు భయాందోళనలో ఉన్నారన్నారు. మోడీ డైరెక్షన్ లోనే కేసీఆర్ పని చేస్తున్నారని, వాళ్లిద్దరివీ డబుల్ ఇంజన్ సర్కార్లు అంటూ అభివర్ణించారు. దేశంలో బీజేపీతో కాంగ్రెస్ మాత్రమే పోరాటం చేస్తోందన్నారు. ఈడీ, ఐటీ దాడులకు భయపడి టీఆర్ఎస్, వైసీపీ, ఎంఐఎం పార్టీలు బీజేపీతో మ్యాచ్ ఫిక్సింగ్ లో ఉన్నాయన్నారు. కాంగ్రెస్ హయాంలో మాత్రమే ప్రజాస్వామ్య పాలన కొనసాగిందన్నారు. కేసీఆర్ దీక్ష చేస్తే తెలంగాణ రాలేదని, సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ వల్లనే తెలంగాణ వచ్చిందన్నారు. ఉమ్మడి ఏపీ విభజనతో కాంగ్రెస్ రాజకీయంగా నష్టపోయిందని, అయినా కాంగ్రెస్ రాజకీయ లబ్ధి కోసం పాకులాడలేదన్నారు. రాహుల్ పాదయాత్ర తెలంగాణలో కాంగ్రెస్ కు బూస్టర్ డోస్ ఇచ్చిందని అన్నారు. ఈ యాత్ర వల్ల రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహం వచ్చిందన్నారు. రాహుల్ అన్ని వర్గాల ప్రజలను కలుస్తున్నారని, ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు.