గణేష్ నిమజ్జన శోభాయాత్రా ఏర్పాట్లు..హైదరాబాద్లో మసీదులకు మాస్కులు

గణేష్ నిమజ్జన శోభాయాత్రా ఏర్పాట్లు..హైదరాబాద్లో మసీదులకు మాస్కులు

హైదరాబాద్ నగరం గణేష్ నిమజ్జన శోభాయాత్రకు సిద్దమవుతోంది.సెప్టెంబర్ 6న సిటీ వ్యాప్తంగా గణనాధుల నిమజ్జనానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఒకేరోజు వేలాది గణపతులు శోభాయాత్రకు వెళ్తున్న క్రమంలో సిటీ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మరోవైపు నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శోభాయాత్ర నిర్వహించే దారుల్లో ఉన్న మసీదులను కవర్లతో కప్పి ఉంచారు. 

అఫ్జల్ గంజ్, చార్మినార్ తోపాటు నగరంలోని ఇతర ప్రాంతాలలోని మసీదులు భారీ వస్త్రాలు, కవర్లతో కప్పి ఉంచారు.  గణేష్ ఊరేగింపు సమయంలో నగరంలో ప్రశాంత వాతావరణాన్ని కొనసాగించేందుకు అధికారులు ఈ పద్ధతిని అనుసరించారు.

ఇదిలా ఉండగా గణేష్ విసర్జన్ ,మిలాద్ ఉన్ నబీకి ముందు నగరంలో శాంతియుత వాతావరణాన్ని కొనసాగించేందుకు హైదరాబాద్ పోలీసులు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు. శాంతి భద్రతల కోసం, పోలీసులు, రాపిడ్ యాక్షన్ ఫోర్స్‌తో నగరంలో మోహరించారు.

నగరంలోని మతపరమైన ప్రదేశాల వద్ద పోలీసులు అదనపు అప్రమత్తంగా ఉన్నారు. ప్రముఖ మసీదులు ,దేవాలయాల వద్ద భారీ భద్రతా దళాలను మోహరించారు. ఊరేగింపు సన్నాహాల కోసం, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మెహదీపట్నంలోని నైరుతి జోన్ డీసీపీ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.హైదరాబాద్‌లో గణేష్ ఊరేగింపు ఏర్పాట్లను సమీక్షించేందుకు నైరుతి మండలంలోని శాంతిభద్రతలు, ట్రాఫిక్ ,ఇతర పోలీసు అధికారులతో సమావేశమయ్యారు.

సామాజిక వ్యతిరేక శక్తులు, జేబు దొంగతనం, ఈవ్ టీజింగ్, చైన్ స్నాచింగ్ వంటి నేరాలను అరికట్టేందుకు నిఘా ఉంచాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. నైరుతి మండలంలోని గోషామహల్, టప్పా చబుత్ర, లంగర్ హౌస్ ,గోల్కొండలోని ముఖ్యమైన గణేష్ మండపాలను పరిశీలించిన డీసీపీ భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.