ఉద్యోగులను పీకేసి తక్కువ ఖర్చుతో నాలుగు రూపాయలు వెనకేసుకుందాం అని పెద్దపెద్ద కంపెనీలు ఏఐ వైపు మళ్లుతున్నాయి. కానీ వస్తవంగా పరిస్థితులు భిన్నంగా మారాయి. AI టూల్స్ వాడితే పనులు స్పీడ్‌గా అయిపోతాయని, ఖర్చులు తగ్గుతాయని అనుకుంటున్న కంపెనీలకు ఇప్పుడు ఏఐ వెండార్స్ పెద్ద షాక్ ఇస్తున్నారు. రూపాయి, రెండు రూపాయలు కాదు.. ఏకంగా కోట్ల రూపాయల తప్పుడు బిల్లులు వేస్తూ కొంపముంచుతున్నారు. ఓపెన్ ఏఐ, ఆంత్రోపిక్ వంటి దిగ్గజ సంస్థల ఏఐ మోడళ్లను వాడుతున్న కంపెనీలకు భారీగా తప్పుడు బిల్లులు వస్తున్నట్లు బయటపడింది. ఏఐ మోడళ్లను నమ్ముకున్న కంపెనీలు కేవలం తప్పుడు బిల్లింగ్ వల్లే దాదాపు రూ.16.15 కోట్లు (1.7 మిలియన్ డాలర్లు) అదనంగా చెల్లించాల్సి వచ్చింది.
ఏఐ బిల్లులను ఆడిట్ చేయడంలో నైపుణ్యం ఉన్న 'వాడిట్' అనే స్టార్టప్ సంస్థ ఈ దోపిడీని బయటపెట్టింది. ఈ ఏడాది మార్చి నుంచి జూన్ 2026 మధ్య కాలంలో 60 కంపెనీలకు చెందిన సుమారు రూ.323 కోట్లు విలువైన ఏఐ ఇన్‌వాయిస్‌లను ఈ స్టార్టప్ పరిశీలించింది. ఈ ఆడిటింగ్‌లోనే ఏఐ కంపెనీల బిల్లింగ్ లోపాలు, ఓవర్‌చార్జీలు గుట్టురట్టయ్యాయి. ఈ బిల్లింగ్ తప్పుల్లో ఎక్కువ భాగం ఆంత్రోపిక్ సంస్థకు చెందిన క్లాడ్ కోడ్ వల్ల జరగ్గా.. ఓపెన్ ఏఐ సర్వీసుల్లో కూడా ఇలాంటి మోసపూరిత బిల్లులు ఉన్నట్లు వాడిట్ గుర్తించింది.
ALSO READ : వాడెవడో డైరీలో రాసుకుంటే నువ్వు నోటీసులు ఇస్తావా
ఈ బిల్లింగ్ తప్పులకు అసలు కారణం ఏంటో 'ది ఇన్ఫర్మేషన్' ప్రతినిధి లారా బ్రాటన్ వివరించారు. సాధారణంగా మనం వాడే ఏఐ ఏజెంట్లు ఏదైనా ఒక పనిని తప్పుగా చేసినప్పుడు, కస్టమర్లకు తెలియకుండానే ఆ టాస్క్‌ను పూర్తి చేయడానికి మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తూ ఉంటాయి. ఇలా ఏఐ ఏజెంట్ బ్యాక్‌గ్రౌండ్‌లో పదే పదే లూప్‌లో రన్ అవ్వడం వల్ల టోకెన్ల వాడకం, ఏపీఐ కాల్స్ విపరీతంగా పెరిగిపోతాయి. కస్టమర్‌కు ఈ విషయం తెలిసేలోపే బిల్లులు కొండలా పేరుకుపోతాయి. అయితే ఈ బిల్లింగ్ తప్పుల ఆరోపణలను ఓపెన్ ఏఐ, ఆంత్రోపిక్ సంస్థలు తోసిపుచ్చాయి. వీటికి తగిన ఆధారాలు లేవని వాదిస్తున్నాయి.
ఈ తప్పుడు బిల్లింగ్ వ్యవహారం బయటపడటంతో పానాసోనిక్, హెచ్‌పీ, హోండా వంటి గ్లోబల్ దిగ్గజాలు 'వాడిట్' సేవలను ఆశ్రయించాయి. కస్టమర్లు గట్టిగా నిలదీయడంతో అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఆంత్రోపిక్, ఓపెన్ ఏఐ వంటి టెక్ వెండార్స్ తలొగ్గక తప్పలేదు. వివాదాస్పదమైన బిల్లుల్లో దాదాపు 80 శాతం మొత్తాన్ని సదరు కంపెనీలకు రీఫండ్ చేశాయి. ఈ చేదు అనుభవాల వల్ల ప్రస్తుతం చాలా కంపెనీలు ప్రీమియం మోడళ్లను వాడుతూనే.. మరోవైపు తక్కువ ధరలో లభించే ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నాయట. ఏది ఏమైనా, రోజురోజుకూ ఏఐ వాడకం పెరుగుతున్న వేళ బిల్లింగ్‌లో పారదర్శకత లేకపోతే కంపెనీల బడ్జెట్లు తలకిందులు కావడం ఖాయంగా కనిపిస్తోంది.
