ఏఐతో పాత ప్రశ్నాపత్రాల విశ్లేషణ..పదోతరగతిలో వెనకబడిన విద్యార్థులపై ఫోకస్

ఏఐతో పాత ప్రశ్నాపత్రాల విశ్లేషణ..పదోతరగతిలో వెనకబడిన విద్యార్థులపై ఫోకస్
  • పాస్ ​పర్సంటేజీని పెంచడమే లక్ష్యంగా కొత్తగూడెం కలెక్టర్ వినూత్న ఆలోచన
  • జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు 124
  • టెన్త్​ విద్యార్థులు 4,418 మంది

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: పదోతరగతిలో విద్యార్థుల పాస్​పర్సంటేజీని పెంచడమే లక్ష్యంగా భద్రాద్రికొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేశ్​వి.పాటిల్​వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. చదువులో వెనకబడిన స్టూడెంట్స్ ను గుర్తించి, గత మూడేండ్ల ప్రశ్నాపత్రాలను ఏఐ ద్వారా విశ్లేషించి మంచి ఫలితాలు రాబట్టాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. 

ప్రీ ఫైనల్​ మార్కుల ఆధారంగా..

ఈ ఏడాది జిల్లాలోని 124 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన దాదాపు 4,418 మంది విద్యార్థులు పదోతరగతి వార్షిక పరీక్షలు రాయనున్నారు. టెన్త్​ రిజల్ట్స్​లో జిల్లా గత నాలుగైదేండ్లుగా రాష్ట్రంలో చివరి 5 స్థానాలకే పరిమితమవుతోంది. ఈ క్రమంలో ఉత్తీర్ణతా శాతాన్ని పెంచడమే లక్ష్యంగా కలెక్టర్ విద్యాశాఖ అధికారులతోపాటు హెచ్ఎంలతో ఇటీవల ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్​లో వచ్చిన మార్కుల ఆధారంగా చదువులో వెనకబడిన విద్యార్థులను గుర్తించాలని ఆదేశించారు. గత మూడేండ్లలో రిపీట్​గా ప్రశ్నలు వచ్చిన చాప్టర్స్​తోపాటు ఏయే చాప్టర్స్​ నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయో ఏఐ ద్వారా విశ్లేషించాలని చెప్పారు. ఈ ప్రోగ్రాం బాధ్యతను కోఆర్డినేటర్ కిరణ్ కుమార్ కు అప్పగించి, ఆయనకు సహాయకుడిగా అల్లూరిని నియమించారు. 

గత సెప్టెంబర్ నుంచి స్పెషల్​ క్లాసులు

ఈసారి టెన్త్​ఫలితాల్లో జిల్లాకు మంచి పేరు రావాలన్న ఉద్దేశంతో విద్యార్థులకు గత సెప్టెంబర్ నుంచే స్పెషల్ క్లాసులు నిర్వహిస్తున్నారు. తాజాగా ఏఐతో విశ్లేషణ వివరాలను సోమవారం కలెక్టర్​కు నివేదించిన అనంతరం ఆయా సబ్జెక్టుల టీచర్లు​చదువులో వెనకబడిన విద్యార్థులను దత్తత తీసుకోనున్నారు. ఎలాంటి ఒత్తిడి లేకుండా వారిని ఎగ్జామ్స్​కు ప్రిపేర్​చేయించేందుకు ప్లాన్​చేస్తున్నారు. మరోవైపు స్టూడెంట్స్​గైర్హాజరును తగ్గించేందుకు గ్రామ, మండల మహిళా సమాఖ్యల సాయం తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. దీంతో టీచర్లు తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇస్తూ టెన్త్​స్టూడెంట్స్​రెగ్యులర్​గా పాఠశాలలకు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. 

కలెక్టర్ ​సూచనల మేరకే..

ఈ విద్యాసంవత్సరం టెన్త్​లో అత్యధిక పాస్​పర్సంటేజీ సాధించడంపై కలెక్టర్​ప్రత్యేకంగా దృష్టి సారించారని ఇన్​చార్జి డీఈవో నాగలక్ష్మి తెలిపారు. చదువులో వెనకబడిన విద్యార్థులు కూడా ఉత్తీర్ణత సాధించేలా ఆర్టిఫిషియల్​ఇంటెలిజెన్స్​ను ఉపయోగించుకోవాలని సూచించారన్నారు. పిల్లల తల్లిదండ్రులతో టీచర్లు తరచూ ఇంటరాక్ట్​అవుతూ మంచి ఫలితాలు రాబట్టేందుకు కృషి చేస్తున్నారు.