V6 News

రిక్రూట్మెంట్స్ లేవమ్మా..! టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ ఎంత మందిని తగ్గించాయంటే?

రిక్రూట్మెంట్స్ లేవమ్మా..! టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ ఎంత మందిని తగ్గించాయంటే?

ఏఐ వల్ల పెద్ద ప్రమాదం లేదులే అని ఇండియన్ ఐటీ కంపెనీలు ఒకపక్క చెబుతూనే మరోపక్క సైలెంట్ గా ఉద్యోగుల సంఖ్యను వివిధ మార్గాల్లో తగ్గించుకుంటున్నాయి. టాప్ ఐటీ కంపెనీలు హైరింగ్స్ విషయంలో చాలా అప్రమత్తంగా ఆచి తూచి ముందుకు సాగుతున్నాయి. చాలా సంస్థలు కొత్త ఆర్థిక సంవత్సరంలో కొత్త రిక్రూట్మెంట్స్ ఎలా ఉంటాయనే రోడ్ మ్యాప్ కూడా ఇవ్వటానికి నిరాకరిస్తున్నాయంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. 

దేశీయ ఐటీ రంగంలో 2026 ఆర్థిక సంవత్సరం ఒక కీలక మలుపుగా నిలిచింది. ఏఐ లక్ష్యాలకు అనుగుణంగా కంపెనీలు తమ కార్యకలాపాలను పునర్వ్యవస్థీకరించుకోవడంతో.. కొత్త ఉద్యోగుల నియామకంలో భారీ తగ్గుదల నమోదైంది. దేశంలోని టాప్ ఐటీ సంస్థలైన టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, విప్రో, టెక్ మహీంద్రా నెట్ హెడ్‌కౌంట్ ఈ ఏడాది 7వేల 389 మేర తగ్గింది. 2025లో 12వేల 718 మందిని కొత్తగా రిక్రూట్ చేసుకున్న కంపెనీలు ఇప్పుడు భారీగా టెక్కీలను తగ్గించుకున్నాయన్నమాట. 

ప్రధాన కంపెనీల రిక్రూట్మెంట్స్ అండ్ లే-ఆఫ్స్:
భారత కార్పొరేట్ రంగంలోనే అతిపెద్ద షాక్ ఇస్తూ.. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఏకంగా 12వేల మందిని తొలగించింది. అయినప్పటికీ క్యూ4లో టీసీఎస్ 2,356 మందిని, హెచ్‌సీఎల్ టెక్ 802 మందిని, విప్రో 135 మందిని కొత్తగా రిక్రూట్ చేసుకున్నట్లు తేలింది. మరోవైపు ఇన్ఫోసిస్ హెడ్‌కౌంట్ 8,440 మేర, టెక్ మహీంద్రా 1,993 మేర తగ్గాయి. మొత్తం ఐటీ ఇండస్ట్రీ పరంగా చూస్తే.. దేశీయ ఐటీ ఉద్యోగుల సంఖ్య 58.2 లక్షల నుండి 59.5 లక్షలకు చేరుకుంది.

టాప్ ఐటీ కంపెనీల కొత్త రిక్రూట్మెంట్స్ ప్లాన్స్ ఇవే:

1. TCS: భవిష్యత్తు అవసరాల కోసం ఏఐ, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ నిపుణులపై దృష్టి పెడుతున్నట్లు టీసీఎస్ సీహెచ్‌ఆర్‌ఓ సుదీప్ కున్నుమల్ తెలిపారు. FY27లో 25వేల మంది ఫ్రెషర్లను నియమించుకోవాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. ఇది గత ఏడాది టార్గెట్ 40వేల మంది కంటే తక్కువే.

2. Infosys: త్రైమాసిక హెడ్‌కౌంట్ తగ్గుదల తాత్కాలికమని, యుటిలైజేషన్ అండ్ ప్రాజెక్ట్ వాల్యూమ్స్ ఆధారంగా రిక్రూట్మెంట్స్ ఉంటాయని సీఎఫ్ఓ జయేష్ సంఘరాజ్కా పేర్కొన్నారు. FY27లో 20వేల మంది ఫ్రెషర్లను తీసుకోవాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది.

3. Tech Mahindra: ప్రస్తుతం మార్జిన్లను పెంచుకోవడంపై దృష్టి పెట్టినట్లు సీఎఫ్ఓ రోహిత్ ఆనంద్ తెలిపారు. ఏఐ వల్ల డిమాండ్ ప్రొఫైల్ మారిందని.. అందుకే ఫ్రెషర్ల నియామకాల్లో వేగం తగ్గించినట్లు చెప్పారు. వచ్చే ఏడాది మధ్యస్థంగా నియామకాలు ఉండవచ్చని అభిప్రాయపడ్డారు.

4. HCLTech: వార్షిక ప్రాతిపదికన లక్ష్యాలను పెట్టుకోవటం కంటే.. ప్రతి క్వార్టర్ లో అవసరాలను బట్టి నియామకాలు చేపడతామని సీపీఓ రామ్ సుందరరాజన్ స్పష్టం చేశారు. FY26లో కంపెనీ ఏకంగా 11వేల 744 మంది ఫ్రెషర్లను తీసుకున్నట్లు ఆయన చెప్పారు.

5. Wipro: ప్రస్తుతం మార్కెట్ అనిశ్చితిగా ఉన్నందున ఫ్రెషర్ల నియామకానికి ఎటువంటి నిర్దిష్ట లక్ష్యం పెట్టుకోలేదని.. పూర్తిగా డిమాండ్ ఆధారంగానే రిక్రూట్‌మెంట్ ఉంటుందని సీహెచ్‌ఆర్‌ఓ సౌరభ్ గోవిల్ వెల్లడించారు.

మొత్తంగా భారత ఐటీ రంగం ప్రస్తుతం "వెయిట్ అండ్ వాచ్" ధోరణిని ఫాలో అవుతున్నాయి. ఏఐ కారణంగా కంపెనీలు భారీ రిక్రూట్మెంట్ల కంటే నైపుణ్యం కలిగిన అభ్యర్థులకే ప్రాధాన్యత ఇస్తున్నాయని కంపెనీల ప్రతినిధుల మాటల ప్రకారం తెలుస్తోంది. అంటే గతంలో మాదిరిగా మాస్ హైరింగ్స్ ఇప్పట్లో ఉండబోవని.. టాలెంట్ ఉన్నోళ్లకే జాబ్స్ అనే పందాను టెక్ కంపెనీలు ఇండియాలో అమలు చేస్తున్నాయి.