
హైదరాబాద్, వెలుగు: దేశవ్యాప్తంగా అన్ని రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రాముఖ్యత పెరుగుతున్నదని హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి అన్నారు. యూనివర్సిటీలు, వాటి అనుబంధ సంస్థల్లో పరిశోధన, విద్యా నైపుణ్యాన్ని బలోపేతం చేయడానికి ఏఐని సిలబస్లో పెట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
గురువారం హైదరాబాద్లోని మెథటిస్ట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (ఎంసీఈటీ)లో రీసెండ్ అడ్వాన్స్మెంట్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ సాఫ్ట్ కంప్యూటింగ్(ఐసీఏఐఎస్సీ–2025) ఇంటర్నేషనల్ సదస్సును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా 18 రాష్ట్రాలకు చెందిన 200లకు పైగా కాలేజీల నుంచి 1,800 మంది 910 పరిశోధనా పత్రాలను సమర్పించారు.
వీటిని రివ్యూ చేసిన తర్వాత 377 పత్రాలను ప్రచురణ కోసం ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో ఎంసీఈటీ సెక్రటరీ కె.కృష్ణారావు, డైరెక్టర్ ఎం.లక్ష్మీపతిరావు, ప్రిన్సిపల్ ప్రభు జి. బెనకోప్, ప్రొఫెసర్ సుధా, లావణ్య, శారద, వరలక్ష్మి, ప్రవీణ్ తదతరులు పాల్గొన్నారు.