తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు AI శిక్షణ

తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు AI శిక్షణ

హైదరాబాద్‌: తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల కోసం నిర్వహించిన శిక్షణా తరగతులు శనివారం ( జనవరి 24 ) నాంపల్లిలోని మీడియా అకాడమీ ఆడిటోరియంలో విజయవంతంగా జరిగాయి.  ఈ శిక్షణా తరగతుల్లో “AI – Journalism – Fact Check – Social Media – Deepfake” అనే అంశంపై ఏఐ పుస్తకాల రచయిత, సీనియర్ జర్నలిస్టు స్వామి ముద్దం ప్రత్యేకంగా బోధించారు. 

జర్నలిజంలో ఏఐ వినియోగం ఎలా ఉండాలి, వార్తల పరిశీలన (ఫ్యాక్ట్ చెక్)లో ఏఐ టూల్స్ ఉపయోగం, సోషల్ మీడియా ప్రభావం, డీప్‌ఫేక్‌లను ఎలా గుర్తించాలి అనే అంశాలపై ప్రాక్టికల్ ఉదాహరణలతో స్పష్టంగా వివరించారు. ఏఐని బాధ్యతాయుతంగా, నైతిక విలువలకు లోబడి ప్రతి జర్నలిస్టు ఎలా వినియోగించుకోవాలో ఆయన వివ‌రించారు.

నిత్యం జర్నలిస్టులు సాంకేతికతను అందిపుచ్చుకోవాలని ఈ కార్య‌క్ర‌మంలో అతిథిగా పాల్గొన్న సాంస్కృతిక శాఖ సంచాలకులు ఏనుగు నర్సింహరెడ్డి సూచించారు. తెలంగాణ మీడియా అకాడమి చైర్మన్ కే. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. డిజిటల్ మీడియాలో భాగంగా ఏఐని ఉపయోగిస్తున్న జర్నలిస్టుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుందన్నారు. జర్నలిజం వృత్తిలో పరిపూర్ణత రావడానికి ఏఐ పరిజ్ఞానాన్ని తప్పనిసరిగా పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

మీడియా అకాడమీ కార్యదర్శి నాగులపల్లి వెంకటేశ్వరరావు జర్నలిస్టులు పాటించాల్సిన బాధ్య‌త‌లపై దిశానిర్దేశం చేశారు. మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా జర్నలిస్టులు తమ నైపుణ్యాలను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. 

ఈ శిక్షణా తరగతుల్లో నల్లగొండ జిల్లా నుంచి వచ్చిన జర్నలిస్టులు ఉత్సాహంగా పాల్గొని, ఏఐపై తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. వేగంగా మారుతున్న డిజిటల్ మీడియా పరిస్థితుల్లో జర్నలిజంలో ఏఐ పాత్రను అవగాహన చేసేందుకు ఈ శిక్షణా కార్యక్రమం ఎంతో ఉపయోగప‌డింద‌ని పాల్గొన్న జర్నలిస్టులు అభిప్రాయపడ్డారు.