- కాలేజీ విద్యార్థులకు ప్రపంచ స్థాయి నైపుణ్యాలు: మంత్రి శ్రీధర్ బాబు
- ఆస్ట్రేలియా డీకిన్ వర్సిటీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఫ్యూచర్ సిటీలో అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) యూనివర్సిటీలో ఏఐ ఎక్స్‌లెన్స్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్టు ఐటీ, ఇండస్ట్రీస్ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఆస్ట్రేలియాకు చెందిన డీకిన్ యూనివర్సిటీతో కలిసి ఈ ఎక్సలెన్స్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. శుక్రవారం సెక్రటేరియెట్‌లో డీకిన్ యూనివర్సిటీతో ఏఐ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.
ఈ సందర్భంగా ఆస్ట్రేలియా ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ జూలియన్ హిల్‌తో కలిసి సెక్రటేరియెట్‌లో శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడారు. దేశంలోనే ఏఐలో తొలి ఎక్సలెన్స్ సెంటర్ ఇదని పేర్కొన్నారు. డీకిన్ అప్లయిడ్ ఆర్టిఫిషియల్ ఇనిస్టిట్యూట్ ఈ ఎక్సలెన్స్ సెంటర్‌ను రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి నిర్వహించనున్నదని వివరించారు.
కాలేజీల నుంచి అకడమిక్ గ్రాడ్యుయేట్లను కాకుండా ప్రపంచస్థాయి నైపుణ్యాలతో కూడిన ప్రతిభావంతులను తయారు చేయాలన్న లక్ష్యంతోనే ఆస్ట్రేలియా ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నట్టు చెప్పారు. విదేశీ యూనివర్సిటీలను రాష్ట్రానికి తీసుకురావడానికి సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే ఈ ఒప్పందం జరిగిందని ఆయన వెల్లడించారు.
ప్రభుత్వ పాలన, ఆరోగ్యం, విద్య, ఐటీ, లైఫ్ సైన్సెస్, వ్యవసాయం, క్రిటికల్ మినరల్స్, రేర్ ఎర్త్ మెటల్స్ రంగాల్లో పరిశోధన, నైపుణ్య శిక్షణ అందజేయడానికి ఈ ఎక్సలెన్స్ సెంటర్ ఉపయోగపడుతుందదని, డిజిటల్ ఇండియా భవిష్యత్తుకు తెలంగాణ ముఖ ద్వారం కానుందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. రాష్ట్రంలోని ప్రముఖ విద్యాసంస్థల్లో కూడా నైపుణ్య శిక్షణ ఏర్పాట్లు జరుగుతున్నాయని మంత్రి చెప్పారు.
