అన్నా డీఎంకే పార్టీలో చీలిక: షణ్ముగం నాయకత్వంలో తిరుగుబాటు..!

అన్నా డీఎంకే పార్టీలో చీలిక: షణ్ముగం నాయకత్వంలో తిరుగుబాటు..!

తమిళనాడు రాజకీయాల్లో మరో సంచలనం. అతి పెద్ద పార్టీగా అవతరించిన విజయ్ టీవీకే పార్టీకి మద్దతు విషయంపై అన్నా డీఎంకే పార్టీలో చీలిక వచ్చింది. అవును.. టీవీకే పార్టీకి మద్దతు ఇవ్వాలని.. డీఎంకే పార్టీని ఎదిరించి నిలబడాలి అంటే.. పార్టీ మనుగడలో ఉండాలి అంటే విజయ్‎కు మద్దతు ఇవ్వాలంటూ అన్నా డీఎంకే పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన షణ్ముగం గళమెత్తారు. షణ్ముగం అలా అన్నారో లేదా.. అన్నాడీఎంకే పార్టీలోని సగానికి పైగా ఎమ్మెల్యేలు ఇలా మద్దతు ఇచ్చారు. ఈ విషయంలో పార్టీ హైకమాండ్ సరైన నిర్ణయం తీసుకోవాలంటూ కె.పళనిస్వామిని నేరుగా కోరారు.

విజయ్ నేతృత్వంలోని టీవీకే 108 సీట్లతో తమిళనాడులో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. మ్యాజిక్ ఫిగర్ 118 స్థానాలకు 10 సీట్ల దూరంలో నిలించింది. ఇప్పుడా 10 సీట్ల కోసం టీవీకే ప్రయత్నాలు షురూ చేసింది. మిత్రపక్షాల మద్దతు కూడగట్టేందుకు సంప్రదింప్రులు జరుపుతోంది. ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకే పార్టీకి మద్దతు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రకటించింది. ఈ క్రమంలో టీవీకేకు మద్దతు విషయంలో అన్నాడీఎంకే పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఓ వర్గం ప్రభుత్వ ఏర్పాటులో టీవీకేకు మద్దతు ఇవ్వాలని వాదిస్తుండగా.. మరో వర్గం మాత్రం ఇందుకు ససేమిరా అంటోంది. 

దీంతో టీవీకేకు మద్దతు విషయంలో అన్నాడీఎంకేలో చీలిక ఏర్పడినట్లు తెలుస్తోంది. అన్నాడీఎంకే సీనియర్ నేత, మైలం ఎమ్మెల్యే సీవీ షణ్ముగం టీవీకేకు మద్దతు ఇవ్వాలని ప్రతిపాదించినట్లు తెలిసింది. షణుగ్మం ప్రతిపాదనతో అన్నాడీఎంకేలోని మెజార్టీ ఎమ్మెల్యేలు ఏకీభవించినట్లు సమాచారం. మెజార్టీ ఎమ్మెల్యేల నిర్ణయాన్ని పరిగణలోకి తీసుకుని టీవీకేకు మద్దతు విషయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె. పళనిస్వామిని నిర్ణయం తీసుకోవాలని ఎమ్మెల్యేలు ఒత్తిడి చేస్తున్నట్లు అన్నాడీఎంకే వర్గాల ద్వారా తెలిసింది.

 పళనిస్వామి ఈ అభ్యర్థనను సానుకూలంగా పరిగణించి, ఎన్నికైన ఎమ్మెల్యేలలో అత్యధికుల కోరికలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని పేరు చెప్పడానికి ఇష్టపడని మరో నేత అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చి టీవీకేతో స్నేహం చేయడానికి ఏఐఏడీఎంకేకు ఇదే సరైన సమయం అని పార్టీ నాయకులు కూడా భావిస్తున్నారు. పొత్తు గురించి అన్నాడీఎంకే, టీవీకే మధ్య చర్చలు జరుగుతున్నట్లు అన్నాడీఎంకే నాయకురాలు లీమా రోజ్ కూడా అన్నారు. మరీ టీవీకేకు మద్దతు విషయంలో ఏర్పడ్డ చీలికను అన్నాడీఎంకే అగ్రనాయకత్వం ఎలా పరిష్కరిస్తుందనేది తమిళనాడులో పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది.