V6 News

బీజేపీకి అన్నాడీఎంకే లొంగిపోయింది.. రాహుల్ గాంధీ ఫైర్

బీజేపీకి అన్నాడీఎంకే లొంగిపోయింది.. రాహుల్ గాంధీ ఫైర్

చెన్నై: అవినీతి ఆరోపణలతో నమోదైన ఈడీ, సీబీఐ కేసుల నుంచి తప్పించుకోవడానికే అన్నాడీఎంకే నాయకులు బీజేపీకి పూర్తిగా లొంగిపోయారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. రాష్ట్రాల స్వయంప్రతిపత్తిని దెబ్బతీస్తూ సమాఖ్య వ్యవస్థను బీజేపీ బలహీనపరుస్తోందని ఫైర్ అయ్యారు. ఒకే భాష, ఒకే సంప్రదాయం అనే విధానాన్ని రుద్దడం ద్వారా దేశ వైవిధ్యాన్ని దెబ్బతీస్తోందని మండిపడ్డారు. 

సోమవారం రాహుల్ తమిళనాడులోని కన్యాకుమారిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ..తమిళ భాష, సంస్కృతి, చరిత్రలను కాపాడటానికి డీఎంకే, కాంగ్రెస్ కూటమి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. తమిళులు తమను సవాల్ చేస్తారనే భయం ఆర్‌ఎస్‌ఎస్‌లో నెలకొందని తెలిపారు. 

నియోజకవర్గాల పునర్విభజన ముసుగులో దేశ ఎన్నికల నిర్మాణాన్ని మార్చాలని కేంద్రం చూస్తోందని విమర్శించారు. ఇలాంటి దేశద్రోహ చర్యలను ప్రతిపక్షాలు ఐక్యంగా అడ్డుకుంటాయని వెల్లడించారు. అధికార కేంద్రీకరణ ద్వారా రాష్ట్రాలను నిర్వీర్యం చేయాలని చూస్తున్న బీజేపీకి తమిళనాడు ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు. ప్రాంతీయ అస్తిత్వం, సమాఖ్య స్ఫూర్తిని రక్షించుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.